Daughter-in-law Shravani who died due to poison experiment in guntur
mictv telugu

కోడలిపై అత్తామామల దుర్మార్గం.. రక్తం, చిన్న పేగుతో వాంతి

November 15, 2022

Daughter-in-law Shravani who died due to poison experiment in guntur

ఆడపిల్లకు జన్మనివ్వబోతోందనే కారణంతో అత్తామామలు కోడలిపై ఘోరానికి పాల్పడ్డారు. పాలు, మజ్జిగలో విషం కలిపి ఆమె మరణానికి కారణమయ్యారు. కుట్రలకు బలైన అమాయక కోడలు.. వారం పాటు నరకయాతన అనుభవించి సోమవారం ప్రాణాలు వదిలింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.

గుంటూరు మండలం సుబ్బయ్యపాలెంకు చెందిన గాడిపర్తి వేణుకి బాపట్ల జిల్లా బల్లికురువ మండలం కొప్పెరపాడుకు చెందిన శ్రావణితో 2020లో వివాహమైంది. భార్యాభర్తల అనుబంధానికి మొదట అమ్మాయి పుట్టగా, అనంతరం శ్రావణి రెండో సారి గర్భం దాల్చింది. మొదటగా కూతురు పుట్టడంతో అప్రమత్తమైన అత్తామామలు రెండో సారి కూడా అమ్మాయే పుడుతుందని లింగ నిర్ధారణ ద్వారా గ్రహించి కుట్రకు తెరలేపారు. పాలు, మజ్జిగలో విషం కలిపి కోడలితో తాగించారు. విష ప్రభావానికి లోనైన శ్రావణి.. రక్తం, చిన్న పేగులతో సహా వాంతి చేసుకోవడంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించిన శ్రావణి కోమాలోకి వెళ్లగా.. మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని మరో హాస్పిటల్‌‌‌కి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. శ్రావణి మరణంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అదే ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదిక రాగానే దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేశ్ బాబు మీడియాకు వెల్లడించారు.