పసిబిడ్డను ఇంటిపై నుంచి విసిరేసిన తండ్రి - MicTv.in - Telugu News
mictv telugu

పసిబిడ్డను ఇంటిపై నుంచి విసిరేసిన తండ్రి

April 13, 2018

కన్నప్రేమకు కొందరు విలువ లేకుండా చేస్తున్నారు. కోతిపిల్ల చచ్చిపోతే తల్లికోతి గంటపాటు హత్తుకుని విలపిస్తుంది. బిడ్డకు ఏ కాస్త కష్టమొచ్చిన తల్లి హృదయం తల్లడిల్లుతుంది. కానీ కొందరి గుండెలు రాతివి. కరగవు. దక్షిణాఫ్రికాలో ఓ తండ్రి.. అధికారుల తీరును నిరసిస్తూ తన బిడ్డను ఇంటిపై నుంచి కిందికి విసిరేశాడు. అదృష్టవశాత్తూ కింద ఉన్న పోలీసులు పాపను పట్టుకోవడంతో ప్రాణాలు నిలిచాయి.

దక్షిణాఫ్రికాలోని పోర్ట్‌ ఎలిజెబెత్‌ దగ్గర్లో న్నక్వాడ్‌వేసి పట్టణంలో ఈ దారుణం జరిగింది. క్వాడ్‌వేసిలో జాయ్‌ స్లోవో ప్రాంతంలో కొందరు సర్కారు అనుమతి లేకుండా 90 ఇళ్లు కట్టుకున్నారు. వీటిని కూల్చడానికి అధికారులు రావడంతో ఉద్రిక్తత తలెత్తింది. స్థానికులు నిరసనకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వి, రోడ్లను దిగ్బంధం చేశారు.

ఒక వ్యక్తి నిరసన తెలుపుతూ ఆరు నెలల వయసున్న కూతురిని ఎత్తుకుని ఇంటిపైకి ఎక్కాడు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లకపోతే పాపను కిందపడేస్తానని హెచ్చరించాడు. పోలీసులు వెనక్కి తగ్గలేదు. దీంతో అతడు పాపను విసిరేశాడు. పోలీసులు ఆమెను పట్టుకోవడంతో ముప్పు తప్పింది. కారణమేదైనా కన్నబిడ్డను చంపుకుంటారా అని ఈ వీడియోను చూసిన జనం ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు కట్టుకుంటున్నప్పుడే అడ్డుకోవాల్సిందని అధికారులకు కూడా చీవాట్లు పెడుతున్నారు.