ప్రస్తుత కాలంలో కామం, కరెన్సీ కారణంగానే క్రైమ్ జరుగుతోంది. ఈ రెండింటి ముందు వావి వరసలు, బంధాలు-అనుబంధాలు అనేవి కనిపించకుండా పోతున్నాయి. ప్రధానంగా డబ్బుకోసం రక్తసంబంధీకులనే చంపేస్తున్న రోజులివి. ఆస్తులపై ఉన్న మమకారంతో తల్లి, తండ్రి, సోదరీ,సోదరుడు అనే బంధాలను మరిచిపోతున్నారు. అడ్డువస్తే ఎంతటి దూరం ఐనా వెళ్తున్నారు. తాజాగా ఆస్తి కోసం తండ్రినే కూతుళ్లు సజీవ దహనం చేశారు. ఈ అనుమానుష ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది.
రాజంపేటకు చెందిన కొప్పుల ఆంజనేయులుకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురికి పెళ్లిళ్లు చేశాడు. అతడికి కొడుకులు లేకపోవడంతో ఓ కూతురు, అమె కుమారుడు ఆంజేయులు వద్ద ఉంటున్నారు. మరో కూతురు కూడా అదే ఊరులో ఉంటుంది. మరొక కూతురు మాత్రం వేరే గ్రామంలో ఉంటుంది. ఇటీవల అతడు ఎకరం భూమి అమ్మేయగా 10 లక్షల రూపాయలు వచ్చాయి. ఈ డబ్బుల విషయంలో తండ్రితో కూతుళ్లకు గొడవ జరిగింది. డబ్బులు ఇవ్వాళ్లంటూ కూతుళ్లు డిమాండ్ చేశారు. అయితే అతడు అందుకు నిరాకరించడంతో ముగ్గురు కూతుళ్లు, మనవుడు కలిసి గుడిసెకు నిప్పంటించారు. ఈ ఘటనలో గుడిసెలో ఉన్న ఆంజనేయులు సజీవదహనం అయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి కోసం కన్న తండ్రిని కిరాతకంగా హత్య చేయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.