ప్రభుత్వాలు చేయలేని పనులు చేస్తున్నాడు..! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వాలు చేయలేని పనులు చేస్తున్నాడు..!

July 17, 2017

వరుణుడు వర్షిస్తే..పుడమి తల్లి పులకరిస్తే…కాలం కలిసి వస్తే రైతన్న కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. లేదంటే అంతా అయోమయమే..ప్రకృతి కన్నెర్ర చేస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాదు..చేసిన అప్పులు తీరవు.. అయినా అన్నదాతలు ధైర్యంగా ఆకాశానికేసి ఎదురుచూస్తూ కాపురాన్ని నెట్టుకొస్తారు. అప్పులోళ్ల బాధ భరించలేని కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి ఏటా ఇవి ఉంటాయి..ఇలా ఒంటరైపోతున్న కుటుంబాల్ని ఆదుకోవడానికి వచ్చినోడే రైతు ప్రేమికుడు. అన్నదాతల్లో ధైర్యన్ని నింపుతూ ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయిన కుటుంబాల్ని తన వంతు ఆదుకుంటున్నాడు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రతి నెల వెయ్యి రూపాయల విరాళం అందిస్తున్నాడు. ఇంతకీ ఎవరు అతను..ఎందుకిలా చేస్తున్నాడు. ఎవరా శ్రీమంతుడు..?

ఇతని పేరు డేవిడ్. మనదేశం కాదు బ్రిటన్. అయినా రైతుల కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయాడు. అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవాలనుకున్నాడు.అంతే ‘నొమాడిక్‌ లయన్‌’పేరుతో ఓ సంస్థను ప్రారంభించిన డేవిడ్‌ నడకనే రైతుదారిగా మార్చుకున్నాడు. 2014లో ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా డేవిడ్‌ రెండేళ్లలో మలేషియా, బోర్నియో ద్వీపంలో దాదాపు 3,600 కిలోమీటర్లు నడిచాడు. ఇప్పుడు భారత్‌లో ‘వాక్‌ ఆఫ్‌ జాయ్‌ ఇండియా’ పేరుతో యాత్రను మొదలుపెట్టాడు.

కుటుంబాన్ని చూసుకోవాల్సిన పెద్దదిక్కు రైతన్న మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తే ఆ భారం పిల్లల జీవితాలపై పడుతుంది. వారి చదువులపై పడటాన్ని దగ్గర్నుంచి డేవిడ్ గమనించాడు. అలాంటి వారికి సాయం చేయాలని రెండేళ్ల నుంచి ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం.. భారత్‌లోని 13 రాష్ట్రాల్లో 10 నెలలపాటు 6వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలవాలని నిర్ణయించుకున్నాడు. ఈ యాత్ర ద్వారా వారికి ఆర్థికంగా చేయూతనందించడంతో పాటు రైతన్నలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రపంచానికి తెలియజేస్తాడు. సేకరించిన విరాళాలను ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబంలో పిల్లల చదువులకు ఖర్చు చేస్తాడు. శనివారం తమిళనాడులోని సునామీ మెమోరియల్‌ పార్కు నుంచి మొదలైన ‘వాక్‌ ఆఫ్‌ జాయ్‌ యాత్ర’2018 మేలో పంజాబ్‌లో ముగియనుంది.

ఈ రైతు ప్రేమికుడు డేవిడ్ చేస్తున్న పని నిజంగా గ్రేట్ కదా..ప్రభుత్వాలు కూడా ఈ పని చేయలేవు.. చేస్తున్నామని చెప్పినా అవి కాగితాలకే పరిమితం. పాలనలో ఎంత మంచి లీడరున్న ఇది సాధ్యం కాదు..ఎందుకంటే రైతుల ఆత్మహత్యలే లేవంటారు.ఇంకా ఎక్కడ సాయం గురించి ఆలోచిస్తారు. ఒకవేల రైతు ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించినా..సాయం కోసం సర్కార్ ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరగాలి. అయినా అధికారులు కనికరించరు.తిరిగి తిరిగి బాధితులు ఊరుకుంటారు తప్ప..సాయం అందదు.దేశంలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందే.. ఈ రైతు ప్రేమికుడు చేసేది చిన్న సాయమే అయినా ఎందరికో ఆదర్శం.మరెందరికో స్ఫూర్తి. ఆల్ ది బెస్ట్ డేవిడ్..విజయవంతంగా భారత్ టూర్ ముగించాలని కోరుకుందాం.