దక్కన్ క్రానికల్, వెంకట్రామ్ రెడ్డి 30 కోట్ల దగా.. - MicTv.in - Telugu News
mictv telugu

దక్కన్ క్రానికల్, వెంకట్రామ్ రెడ్డి 30 కోట్ల దగా..

March 23, 2018

బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలను దొంగలు దొంగలు కలసి ఊళ్లు పంచుకుంటున్నట్లు దోచేసుకుంటున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, రోటామాక్, కనిష్క్ జ్యుయెలరీ జాబితాలో రోజుకొకరుచేరుతున్నారు. ప్రముఖ దక్షిణాది ఆంగ్లదినపత్రిక దక్కన్ క్రానికల్‌ను అచ్చేస్తున్న డీసీహెచ్ఎల్, దాని చైర్మన్ టి.వెంకట్రామ్ రెడ్డి.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను రూ. 30.54 కోట్లకు ముంచారని సీబీఐ గురువారం కేసుపెట్టింది.

వీరితోపాటు, ముంబైలోని కేర్ రేటింగ్ లిమిటెడ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, యునైటెడ్ ఇన్సూరెన్స్ కు చెందిన ఇద్దరు అధికారుల పేర్లను ఎఫ్ఐఆర్‌లోకి ఎక్కించింది. యునైటెడ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎ.సుబ్రమణియన్, చీఫ్ మేనేజర్ కేఎల్ కుంజిల్వార్లు.. 2011 ప్రాంతంలో ప్రజల నుంచి వసూలు చేసిన ప్రీమియాల మొత్తాలను డీసీహెచ్ఎల్‌లో అనుమానాస్పద రీతిలో అసెక్యూర్డ్ డిబెంచర్లుగా పెట్టుబడులుగా పెట్టారని, అయితే ఆ సంస్థ తిరిగి అసలు, వడ్డీలను చెల్లించలేదని సీబీఐ అధికారులు తెలిపారు.

ఆ కంపెనీ ఇచ్చిన చెక్కులు చెల్లలేదని సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. కేర్ రేటింగ్ లిమిటెడ్ ఆమోదం వీరు ఈ దగాకు పాల్పడ్డారని, ఫలితగా ‌రుణాలు తీసుకునే సామర్థ్యం భారీగా పెరిగిందని వెల్లడించింది.