బాటిల్‌ నీళ్లతో భారీ బాంబు నిర్వీర్యం - MicTv.in - Telugu News
mictv telugu

బాటిల్‌ నీళ్లతో భారీ బాంబు నిర్వీర్యం

March 11, 2022

07

ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలై సుమారు రెండు వారాలు అయింది. అప్పటినుంచి ఇప్పటిదాకా యుద్ధం భీకరంగా జరుగుతుంది. ఉక్రెయిన్‌పై పుతిన్ సేనలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఓవైపు తుపాకుల మోత, మరోవైపు బాంబు పేలుళ్లతో ఉక్రెయిన్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ సందర్భంగా నాటో దేశాలు ఉక్రెయిన్‌కు తమవంతు సహాయసహకారాలు అందిస్తుండడంతో.. ఉక్రెయిన్ సైన్యం దీటుగా రష్యా సేనలకు సమాధానమిస్తోంది.

ఈ నేపథ్యంలో పౌరులు స్వతంత్రంగా తుపాకులు చేతపట్టి దేశం కోసం పోరాడుతున్నారు. కొంతమంది ఉక్రేనియన్లు నిర్భయంగా రష్యా యుద్ధ ట్యాంకులకు ఎదురు నిలబడి ముందుకెళ్లకుండా అడ్డుపడుతున్నారు. రష్యా ప్రయోగించే భారీ క్షిపణులు, బాంబులకు సైతం ఉక్రెయిన్ సైన్యం భయపడటం లేదు. యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్‌పై రష్యా ఇటీవల భారీ బాంబును జార విడిచింది. అది గనుక పేలితే దాని విస్పోటన శక్తికి ఒక పెద్ద భవంతిని క్షణాల్లో నేల మట్టం చేయగలదు. అదృష్టవశాత్తు అది పేలకపోవడంతో, అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ భారీ బాంబుని ఉక్రెయిన్ బాంబ్ స్వ్కాడ్‌కు చెందిన ఇద్దరు నిపుణులు ఎంతో ధైర్యంగా దాన్ని నిర్వీర్యం చేశారు.

ఎలాంటి పరికరాలు లేకుండా ఒక బాటిల్ నీటిని ఉపయోగించి నిర్వీర్యం చేశారు. ఒకరు బాటిలో నీరు పోస్తుండగా, మరొకరు చాకచాక్యంగా దాన్ని పేలకుండా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీళ్ల దైర్యానికి సలాం కొట్టాల్సిందే అంటూ కామెంట్లు పెడుతూ కొనియాడుతున్నారు.

మరోపక్క యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. యుద్ధం ఎప్పుడెప్పుడు ఆగిపోతుందని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు చర్చలు జరిగినా ఫలితం రాలేదు. దీంతో ప్రజలు ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లిపోతున్నారు. పలు దేశాల అధ్యక్షులు అటు పుతిన్‌కి, ఇటు జెలెన్ స్కీకి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నారు. అయిన యుద్ధం మాత్రం రోజురోజుకు తీవ్రతరం అవుతుందే తప్ప శాంతించటం లేదు.