మీరు మాత్రం చావరా? మీ శవాలను బీరువాల్లో పెడతారా? - MicTv.in - Telugu News
mictv telugu

మీరు మాత్రం చావరా? మీ శవాలను బీరువాల్లో పెడతారా?

March 21, 2018

రోజురోజుకూ మనుషులు.. మరోజాతి జంతువుల్లా తయారవుతున్నారు. ఏ జంతువు పేరు పెట్టి తిట్టినా ఆ జంతువులు.. ‘ఛీఛీ.. మాతో వాళ్లను పోలుస్తారా?’ అని ఛీకొట్టే పరిస్థితి. జనన మరణాలు సహజమని, ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషీ ఏదో ఒక రోజు చనిపోతాడని తెలిసి కూడా కొందరు శవాలను బహిష్కరిస్తున్నారు. ఈ బోర్డు చూస్తే మీకు సంగతి అర్థమై ఉంటుంది. విజయవాడ మహానగరంలో ఇలా బోరవిడచుకుని బోర్డు కొట్టుకుని నిలబడిందీ అమానుషం.

విద్యాధరపురం చెరువు సెంటర్‌లో ఉన్న మర్రిచెట్టు సెంటర్‌ వద్ద ఈ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జనం తిరిగే సెంటర్‌ కాబట్టి స్థానికులకు ఇబ్బంది కలుగుతుంది కనుక శవాలను అక్కడ పెట్టొద్దని, స్నానాలు చేయించకూడదని స్థానికులు బోర్డు పెట్టారు. అద్దె ఇళ్లలోకి మృతదేహాలను తీసుకురావొద్దని ఇళ్ల యజమాన రాక్షసులు హుకుం జారీ చేస్తుంటారు. అనారోగ్యంతో చనిపోయిన వారిని ఊళ్లలోకి తీసుకురావొద్దనే గ్రామపంచాయితీలూ ఉన్నాయి. ఆ ఘోరాలు ఏమాత్రం తక్కువ కాకుండా మర్రిచెట్టు సెంటర్ స్థానికులు పెట్టిన ఈ బోర్డులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

కొండలు ఎక్కలేక కిందనే..

మర్రిచెట్టు సెంటర్‌ పైభాగంలో కొండలపై కొందరు ఇళ్లు కట్టుకని నివసిస్తున్నారు. ఆ కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే శవాలను ఆస్పత్రుల నుంచి కొండపైకి తీసుకెళ్లలేక సెంటర్ వద్దే ఉంచి, స్నానదికాలు చేస్తుంటారు. అదే అక్కడి లోకల్ నాయకులకు కంటగింపైంది. తమ అడ్డాలో శవాలను ఉంచుతారా అని బెదిరిస్తూ స్థానికుల పేరుతో ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారు.