మూడు రోజులుగా వార్డు వద్దే శవం... - MicTv.in - Telugu News
mictv telugu

మూడు రోజులుగా వార్డు వద్దే శవం…

August 21, 2017

సికింద్రాబాద్ లోని ప్రతిష్టాత్మక గాంధీ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు వద్ద మూడు రోజులుగా ఓ శవం పడి ఉంది. ఆ ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వస్తున్నా ఆస్పత్రి సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు ముక్కు మూసుకుని తిరుగుతున్నారు. శవాన్ని అక్కడి నుంచి తొలగించి మార్చురీకి తరలించాలని పలువురు అధికారులను కోరినా స్పందన కరవైంది. సిబ్బంది కొరత వల్ల శవాన్ని తొలగించలేదా? లేకపోతే మరేదైనా కారణం ఉందా? అని ప్రశ్నించగా మౌనమే సమాధానంగా వచ్చింది.

అది అనాథ శవం అని భావిస్తున్నారు. అయితే మృతుడిని బంధువులు అంత్యక్రియల భారం భరించలేక వదిలేసి ఉండొచ్చని కూడా అనుకుంటున్నారు. ఏదేమైనా పరిశుభ్రంగా ఉండాల్సిన ఆస్పత్రిలో ఈ శవం వ్యవహారం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.