మైల అంటూ ఊరు మోయనంది.. పోలీసులు మోశారు! - MicTv.in - Telugu News
mictv telugu

మైల అంటూ ఊరు మోయనంది.. పోలీసులు మోశారు!

March 8, 2018

ఈ రాకెట్ యుగం కూడా మూఢనమ్మకాలను నిర్మూలించకలేకపోతోంది. దేవుడు, దెయ్యం పేర్లతో మనుషులు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు. ప్రాణం విడిచిన సాటి మనిషిని గౌరవంగా సాగనంపడానికి గ్రామస్తులు నిరాకరించారు. దైవదీక్షలో ఉన్నామని, మృతదేహాన్ని తాకితే మైల పడతామని దూరం దూరం జరిగారు. అయితే ముగ్గురు మనసున్న పోలీసులు చనిపోయిన వ్యక్తితో తమకేం సంబంధం లేకపోయినా.. అతని నిర్జీవ కాయాన్ని మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఉదంతం కర్ణాటకలోని దక్షిణ కన్నడజిల్లా గుల్గోడిలో జరిగింది.

గ్రామానికి చెందిన 80 ఏళ్ల అలసప్ప అనే వృద్ధుడు ఎత్తయిన కొండ ప్రాంతంలో మరణించాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. కొడుకు రవి అక్కడికి చేరుకున్నాడు. శవాన్ని కొండకింద నుంచి తన ఇంటికి మోసుకెళ్లడానికి సాయం పట్టాలని గ్రామస్తులను కోరాడు. అయితే తాము దైవదీక్షలో ఉన్నామని, శవాన్ని పట్టుకోబోమని బంధుమిత్రులతోపాటు మొత్తం గ్రామంలోని జనమంతా తిరస్కరించారు.  అసలే దు:ఖంలో ఉన్న రవి మరింత కుంగిపోయాడు.

ఈ విషయం స్థానిక విలేకరి ద్వారా పోలీసులకు తెలిసిందే. ఎస్ ప్రకాశ్ వెంటనే ఇద్దరు పోలీసులతో అక్కడికి చేరుకున్నాడు. శవాన్ని పట్టడానికి సాయం చేయండని గ్రామీణులను కోరారు. అయితే వారు అప్పుడు కూడా నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులే సాయం పట్టారు. వృద్ధుడి కాయాన్ని ఒక బెంచిపై పడుకోబెట్టి, తాళ్లు కట్టి రవితో కలసి కొండ కిందికి తీసుకొచ్చారు. వీరి సాయానికి మెచ్చుకున్న ఎస్పీ రివార్డు ప్రకటించారు.

కులాంతర వివాహం చేసుకున్నాడని..

 

అలసప్ప భౌతికకాయాన్ని మోయడానికి గ్రామస్తులు నిరాకరించడం వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. గౌడ కులస్తుడయిన రవి బిల్లవ కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడంతో గ్రామస్తులు వారిని వెలివేశారని చెబుతున్నారు.