బ్యాంకుకు శవాన్ని తీసుకొచ్చారు..  - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంకుకు శవాన్ని తీసుకొచ్చారు.. 

January 6, 2021

 canara bank

శ్మశానానికి తీసుకెళ్లాల్సిన శవాన్ని బ్యాంకుకు తీసుకెళ్లారు. మేనేజర్ ముందు ఉంచి, ‘ఇప్పుడైనా మర్యాదగా ఇస్తారా లేకపోతే ఇక్కడే తగలబెట్టమంటారా?’ అని అడిగారు. వారి మాటలో ఆగ్రహం ఉంది. ఆవేశం ఉంది. ఇంతకూ వారు బ్యాంకుకు మృతదేహాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకలా హెచ్చరించారు? 

అది బిహార్ రాష్ట్రం పట్నా దగ్గర్లోని సిగరియావా గ్రామం. గ్రామానికి చెందిన మహేశ్ యాదవ్ అనే 55 సంవత్సరాల వ్య‌క్తి చనిపోయాడు. అతనికి నా అన్నవారు ఎవరూ లేరు. కూలినాలి చేసుకుంటూ స్థానిక‌ కెనరా బ్యాంకు ఖాతాలో డ‌బ్బు జ‌మ చేసుకుంటుండేవాడు. అతడు మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశాడు. బంధువులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులు అంత్యక్రియలకు పూనుకున్నారు. మహేశ్ బ్యాంకు  పుస్తకం చూసి డబ్బులు ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ డబ్బుతో ఘనంగా అంత్యక్రియలు చేయొచ్చనే బ్యాంకుకు వెళ్లారు.

బ్యాంకు అధికారులు వారికి షాకిచ్చారు. మహేశ్ తన బ్యాంకు ఖాతాకు నామినీగా ఎవరి పేరూ రాయలేదని, డబ్బులు ఇవ్వాలంటే అతడు రావాల్సిందేనని తేల్చి చెప్పారు. ‘చచ్చిపోయిన మనిషి ఎలా వస్తాడయ్యా..’ అని అడిగితే ‘ఏమో మాకేం తెలీదు. రూల్స్ రూల్సే.. ’ అన్నారు. ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. దీంతో గ్రామస్తులు మహేశ్ శవాన్ని మోసుకొచ్చి బ్యాంకు నట్టనడుమ పెట్టేశారు. 

బ్యాంకు మేనేజర్ కంగు తిన్నాడు. మూడుగంటల పాటు మంతనాలు సాగాయి. మేనేజర్ మర్యాదగా మెట్టు దిగొచ్చాడు. మహేశ్ డబ్బుల గురించి తర్వాత మాట్లాడుకుందామని, ప్రస్తుతానికి పది వేలు తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాలని తన జేబు నుంచి 10 వేల రూపాయల సొంత డబ్బు తీసి ఇచ్చాడు. ఏ విషయంలోనైనా అతి చేయకూడదని ఊరికే అనలేదు కదా మన పెద్దలు..