కరోనా చుట్టుపై కొత్త పోటు.. ముక్కు నుంచి నెత్తురు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా చుట్టుపై కొత్త పోటు.. ముక్కు నుంచి నెత్తురు

May 30, 2022

ప్రపంచాన్ని మరో కొత్త వ్యాధి కలవరపెడుతుంది. ఇరాక్ దేశంలో పెరుగుతున్న కాంగో ఫీవర్ ప్రపంచవ్యాప్త ఆందోళనకు కారణంగా మారింది. కరోనా ఉధృతి కాస్త తగ్గింది అని ఊపిరి తీసుకుంటున్న జనాలకు ఓవైపు మంకీ పాక్స్ ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు కాంగో ఫీవర్ కొత్తగా కలకలం రేపుతుంది. తాజాగా ఇరాక్ దేశంలో కాంగో ఫీవర్ తో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 19 మంది కాంగో ఫీవర్ బారినపడి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తున్న ఈ వ్యాధి సోకితే జ్వరం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలతో మరణిస్తారు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు.

క్రిమియన్‌ – కాంగో హెమోరేజిక్‌ ఫీవర్‌ అనేది పేల ద్వారా జంతువుల్లో వ్యాపిస్తుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులు వైరస్‌ వాహకాలుగా ఉంటాయి. అలా వైరస్‌ బారినపడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు లేదా వైరస్‌ ఉన్న పేలు కుట్టినప్పుడు మానవులకు సోకుతుంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తులకు శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతోపాటు ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి చివరకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇరాక్‌లో 1979లో తొలిసారి ఈ వైరస్ వెలుగు చూసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యధిక కేసులు   నమోదవుతున్నాయి.