Deaf and dumb magician sheetal inspiring story
mictv telugu

కరతాళ ధ్వనులు వినిపించని ఇంద్రజాలికురాలు!

November 17, 2022

ఆమె చెప్పేది ఎవరికీ అర్థం కాదు.. ఎవరు ఏం చెప్పినా వినలేదు. కానీ తన ప్రదర్శనలతో మంత్ర ముగ్ధుల్ని చేయగల ఇసత్తా ఉన్న ఇంద్రజాలికురాలు శీతల్. నాగపూర్కి చెందిన ఈమె మాయమరాఠ విద్యతో.. అదేనండీ ఇంద్రజాలంతో అందర్నీ కట్టిపడేస్తుంది. మరి ఆమె గురించి ఆమె మాటల్లోనే చదువుదామా..

15 ఆగస్టు 2000లో మొదటి ప్రదర్శన ఇచ్చాను. వేల మంది మధ్యలో ఈ ప్రదర్శన సాగింది. నాలా ఉన్నవాళ్లు ఈ ప్రదర్శనకు వచ్చారు. వారి ముందు ఈ ప్రదర్శన ఇవ్వడంతో నాలో ఆత్మస్థైర్యం మరింత పెరిగింది. ఇక అప్పుడే నేను మ్యాజిక్ నా ప్రొఫెషన్గా కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. దానికోసం మరింత కఠినంగా సాధన చేశాను.

పుట్టినప్పటి నుంచే నాకు చెవులు వినిపించవు. దాంతో మాట కూడా పడిపోయింది. నా ముందు పుట్టిన అన్నయ్య కూడా ఇదే వ్యాధి ఉంది. కానీ తను నేను పుట్టిన కొన్ని రోజులకే ఇతర కాంప్లికేషన్ల వల్ల చనిపోయాడు. దాంతో నా తల్లిదండ్రులు నా మీద మరింత శ్రద్ధ పెట్టారు. నన్ను ప్రత్యేకమైన స్కూల్లో చేర్పించి సైగల భాష నేర్పించారు. ఇందులో టీచర్ల కంటే మా అమ్మపాత్ర ఎంతో ఉంది. నన్ను ఎంతగానో మోటివేట్ చేసి సైగల భాష తాను నేర్చుకొని నాకు నేర్పించింది. ఆమె సహాయంతోనే నేను దూరవిద్య ద్వారా బీకామ్ పూర్తి చేశాను. అది అయ్యాక ఉద్యోగ వేట ప్రారంభించాను. అసలు నేను ఎందులో ఫిట్ అవుతానో కూడా నేను తేల్చుకలేని పరిస్థితిలో ఉన్నాను.

ఆ సమయంలో..

గోక్లే అనే గురువు నాకు పరిచయం అయ్యారు. అప్పటి వరకు ఎన్నో ఆలోచనలతో ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్న నాకు ఆయన పరిచయం ఒక ఊతంలా అనిపించింది. ఆయన ప్రొఫెషనల్ మేజిషియన్. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా నేను ఆయనకు శిష్యురాలిని అని గర్వంగా చెబుతాను. ఆయన వల్లే నేను మేజిషియన్ అయ్యాను. ఆయన ఆశీస్సులతో వందల షోలు ఇచ్చాను. యూఎస్, యూరోప్లో కూడా వందల ప్రదర్శనలు ఇచ్చా. 2014లో చికాగోలో ప్రపంచ మూగ,చెవిటి మ్యాజిక్ ఉత్సవాలు జరిగాయి. దాంట్లో నాకు రెండవ బహుమతి వచ్చింది. దాంతో నాకు మరింత బాధ్యత పెరిగినట్టు అనిపించింది. అప్పుడే నాలా ఉన్న ఆడవాళ్లకు మ్యాజిక్ నేర్పించాలని నిర్ణయించుకున్నాను. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలని అనుకుంటున్నాను. నేను కేవలం మ్యాజిక్ మాత్రమే చేస్తాననుకుంటే పొరబడినట్టే. నేను ఒక భార్యగా, తల్లిగా, డ్యాన్సర్గా, యాక్టర్గా కూడా అన్నిబాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. ఏదో లోపం ఉందని అలాగే కూర్చోకుండా మనలో ఉన్న టాలెంట్ని గుర్తించి ముందుకు సాగాలని కోరుతున్నాను.