కేసీఆర్‌ గారూ, తాగడానికి నీళ్లు లెవ్వు.. చిన్నారుల ఆవేదన - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌ గారూ, తాగడానికి నీళ్లు లెవ్వు.. చిన్నారుల ఆవేదన

October 29, 2019

‘ప్రియమైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారూ.. మాకు మంచినీళ్ల సౌకర్యం కల్పించండి. ఉన్న నీళ్లు కూడా కలుషితం అయిపోతున్నాయి’ అంటూ కొందరు చిన్నారులు కలిసి రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు, ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు. ప్రస్తుతం ఈ పోస్టుకార్డు ఉత్తరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. ఈ చిన్నారులు చేసిన విన్నపానికి చాలామంది నెటిజన్లు స్పందిస్తున్నారు. హైదరాబాద్‌లోని అలకాపూర్ టౌన్‌షిప్‌కు చెందిన కొందరు చిన్నారులు తమ సమస్యలను వివరిస్తూ లేఖలు రాశారు. ఐదేళ్లుగా తాగడానికి మంచి నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వచ్ఛమైన నీళ్లని పొందడం మానవుడి ప్రాథమిక హక్కు అని, ప్రజలకు అధికారులు కల్పించాల్సిన కనీస సౌకర్యం మంచినీరే అని వారు ఉత్తరంలో పేర్కొన్నారు. తమకు  తాగేందుకు మంచి నీరు అందట్లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ మెట్రోపొలిటన్ వాటర్ సప్లై అండ్ సెవెరేజ్ బోర్డుకి కూడా పోస్టు కార్డులు పంపారు. ఈ రోజు ఉదయం స్వామి వివేకానంద పార్కుకి తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చిన చిన్నారులు తమ ప్రాంతంలోని మంచి నీటి సమస్యపై నిరసనను తెలిపారు. పిల్లల అభ్యర్థనను ముఖ్యమంత్రి, మంత్రి గార్లు తీర్చాలి అని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.