ఢిల్లీ హింసలో మళ్లీ కాల్పులు.. జర్నలిస్టు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ హింసలో మళ్లీ కాల్పులు.. జర్నలిస్టు మృతి

February 25, 2020

Firing

దేశరాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేటు చానెల్‌కు చెందిన జర్నలిస్టుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జర్నలిస్ట్ చనిపోవడం కలకలం రేపుతోంది. మొన్న కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ చనిపోయిన ఘటన గురించి మరిచిపోకముందే ఢిల్లీలో మళ్లీ కాల్పుల మోత మోగడం సంచలనంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం మౌజ్‌పూర్ ప్రాంతంలో వార్తల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తు తెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను సహచరులు గురుతేగ్ బహదూర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన మృతిపై మీడియా సంస్థలు విచారం వ్యక్తం చేశాయి. 

ఇదిలావుండగా సీఏఏపై ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు ఇంకా అదుపులోకి రాలేవు. ఈ పరిస్థితిపై  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. హింస నియంత్రణ కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో జరిగిన హైలెవల్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన జీటీబీ ఆస్పత్రికి వెళ్లి హింసలో గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించారు.

శాంతించని ఢిల్లీ.. 

ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్, సీలంపూర్‌, బ్రహ్మపురి, మౌజ్‌పూర్ తదితర ప్రాంతాల్లో హింస ప్రభావం ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. సోమవారంనాడు జరిగిన కాల్పుల ఘటనల్లో ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తోపాటు నలుగురు పౌరులు మరణించిన విషయం తెలసిందే. కాల్పులకు తెగబడ్డ షారూఖ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఘటన గురించి మరిచిపోకముందే మంగళవారం తాజాగా చెలరేగిన అల్లర్లలో ఒక జర్నలిస్టుతో పాటు ముగ్గురు పౌరులు చనిపోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. పలు ఘటనల్లో సుమారు 40 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హింసాయుత ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.