తెలంగాణలో తోక ముడుస్తున్న కరోనా.. నేడు 3 కేసులు
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టుగానే ఉంది. ఇవాళ రాష్ట్రంలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1085 కేసులు నమోదవగా, 471 ఆక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఇవాళ 40 మంది డిశ్చార్జ్ అవగా.. మొత్తం 585 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ఇప్పటివరకు కరోనాతో 29 మంది మృత్యువాత పడ్డారన్నారు. ఈరోజు ఒక్కరు కూడా మృత్యువాత పడలేదని హర్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు కోలుకుంటున్నారని.. ఎవరికీ ప్రమాదం లేదని అధికారలు వెల్లడించారు.
జీహెచ్ఎంసీ మినహా ఇతర జిల్లాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గముఖం పడుతున్నాయని.. కరోనా ఫ్రీ జిల్లాలు కూడా పెరుగుతున్నాయని ఈటల తెలిపారు. రాష్ట్రంలో వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక గత 14 రోజుల్లో కామారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని వివరించారు.