Analysis : చైనా తైవాన్‌‌పై ఆక్రమణ వెనుక కారణాలేంటి? అసలు గొడవ ఏంటి - MicTv.in - Telugu News
mictv telugu

Analysis : చైనా తైవాన్‌‌పై ఆక్రమణ వెనుక కారణాలేంటి? అసలు గొడవ ఏంటి

June 16, 2022

ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యా యుద్దం జరుగుతున్నా ప్రపంచంలో రాబోయే తర్వాతి యుద్ధం చైనా – తైవాన్‌ల మధ్యనే అన్న చర్చ నడుస్తోంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య అసలు వివాదం ఏంటి? చైనా తైవాన్‌ను ఎందుకు ఆక్రమించుకోవాలనుకుంటోంది? వంటి విషయాలపై మైక్ టీవీ తరపున చిన్న విశ్లేషణ అందిస్తున్నాం. నచ్చితే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే.. ఏదైనా సమస్య లేదా వివాదం పూర్తి స్థాయిలో సమసిపోవాలంటే దాని అసలు కారణం తెలుసుకోవాలి. అప్పుడే సరైన పరిష్కారం దొరుకుతుంది. మరి సమస్య మూలాలు తెలుసుకోవాలంటే ఆ సమస్య ఎక్కడ ఎలా ప్రారంభమైందో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చైనా – తైవాన్‌ల మధ్య సమస్య, ఘర్షణల గురించి వివరంగా తెలుసుకుందాం.

నేపథ్యం : 1894 – 95లో చైనా రాజుల పరిపాలనలో ఉండేది. వారి అసమర్ధత కారణంగా రాజ్యంలో అంతర్గత సమస్యలు ఎక్కువయ్యాయి. గమనించిన జపాన్.. అదను చూసి చైనాపై దాడి చేసింది. కొరియా, తైవాన్, ఇప్పటి చైనాలోని కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. దీన్ని మొదటి చైనా – జపాన్ యుద్ధంగా పిలుస్తారు. ఇందులో చైనా ఓడిపోయింది. ఓడిపోవడంతో చైనా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది. తర్వాత మన వల్లభాయ్ పటేల్ లాగా సన్ యెట్ సన్ అనే వ్యక్తి చైనాను ఒక్కటిగా చేయాలనే ఉద్దేశంతో 1912లో కొమిన్ టాంగ్ అనే పార్టిని స్థాపించాడు. అయితే ఆయన తన ప్రయత్నాలు ఫలించకముందే 1925లో చనిపోయాడు.

సైద్ధాంతిక వైరుధ్యం : సన్ యెట్ సన్ మరణం తర్వాత కొమిన్ టాంగ్ పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. ఈ రెండు పార్టీలలో ఒకటి రిపబ్లిక్ పార్టీ, మరొకటి కమ్యూనిస్టు పార్టీ. రెండు పార్టీల మౌలిక సూత్రాలేమిటంటే.. రిపబ్లిక్ పార్టీ ఏమో ప్రజల చేతిలో అధికారం ఉండాలని భావించేది. అంటే మన దగ్గర వున్న ప్రజాస్వామ్యం లెక్క. కమ్యూనిస్టు పార్టీ ఏమో ప్రజలకు అధికారం ఇవ్వద్దు. అధికారం మొత్తం ప్రభుత్వం వద్ద ఉండాలని భావించేది. అంటే ఒకే పార్టీ, నియంత పరిపాలన ఉండాలి. రిపబ్లిక్ పార్టీ నేత చాంగ్ కాయి స్కెక్ కాగా, కమ్యూనిస్టు పార్టీ నేత మావో జెడాంగ్. వీరిద్దరూ కూడా చిన్న ముక్కలుగా ఉన్న చైనాను ఒక్కటిగా చేయాలనే సంకల్పంతో ఉన్నారు.

అంతర్యుద్ధం : ఈ క్రమంలో ఇద్దరు నేతలు, రెండు పార్టీల మధ్య ఆధిపత్య ధోరణులు ఎక్కువయ్యాయి, ఇది తీవ్ర రూపం దాల్చి ఒకరినొకరు భౌతిక దాడులు చేసే వరకు వెళ్లింది. ఇది క్రమంగా పెరిగి 1927లో షాంఘై నగరంలో రిపబ్లిక్ పార్టీ వారు కమ్యూనిస్టు పార్టీ వారిని లక్షల సంఖ్యలో నరికి చంపేంత వరకు వెళ్లింది. దీంతో కమ్యూనిస్టు పార్టీ కూడా ధీటుగా బదులివ్వడంతో చైనాలో అంతర్యుద్ధం (సివిల్ వార్) మొదలైంది. చివరికి ఉంటే ఒకే పార్టీ విజయం సాధించి, మరో పార్టీ లేకుండా చేయాలిన ఇరు పార్టీలు తీవ్రంగా క‌ృషి చేశాయి. ఇద్దరిలో ఒకరే ఉండాలన్నంతగా పోరాటం సాగింది. ఈ గ్యాపులో జపాన్ మరోసారి 1931లో దాడి చేసి మంచూరియాను స్వాధీనం చేసుకుంది.

కలిసిపోయిన పార్టీలు : దీంతో ఇరు పార్టీలు దేశం కోసం ఒక్కటవ్వాలన్న తలంపుతో కలిసిపోయి జపాన్ మీద యుద్ధం ప్రకటించాయి. దీంతో పటిష్టమైన జపాన్ 1937లో రెండో జపాన్ – చైనా యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధం 1945 వరకు సాగింది. అదే ఏడాది రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా అమెరికా జపాన్ మీద అణుబాంబులు వేయడంతో అప్పటివరకు బలహీనంగా ఉన్న చైనా విజయం సాధించినట్టైంది. అంతకు ముందు ఆక్రమించుకున్న మంచూరియాను జపాన్ వదిలేసింది. అణుబాంబులతో జపాన్ తీవ్రంగా నష్టపోవడంతో (ఇండియాను పరిపాలించే సామర్ధ్యం లేక బ్రిటన్ కూడా మనకు స్వాతంత్ర్యం ఇచ్చేసింది.) తన దేశంపై దృష్టిని సారించింది.

కమ్యూనిస్టు చైనా ఆవిర్భావం : జపాన్ ఈ విధంగా వెళ్లిపోవడంతో అప్పటివరకు కలిసి ఉన్న రెండు పార్టీలు మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించాయి. ఈ సమయంలో మావో కమ్యూనిస్టు పార్టీ పక్కనే ఉన్న మరో కమ్యూనిస్టు దేశమైన రష్యా సాయం కోరింది. రష్యా సాయంతో చైనా కమ్యూనిస్టు పార్టీ రిపబ్లిక్ పార్టీని 1948లో ఘోరంగా ఓడించింది. అప్పటికే 95 శాతం భూభాగం కమ్యూనిస్టుల చేతికి రావడంతో 1949లో చైనాను కమ్యూనిస్టు దేశంగా ప్రకటించారు.

తైవాన్ ఆవిర్భావం : దీంతో నిరాశకు గురైన రిపబ్లిక్ పార్టీ అధినేత చాంగ్ కాయి స్కెక్ తన 20 లక్షల మంది అనుచరులు, సామాగ్రితో సమీపంలో ఉన్న ‘ఫార్ముసా’ ద్వీపానికి వెళ్లిపోయాడు. ఈ ఫార్ముసా ద్వీపమే నేటి తైవాన్. 1950 నాటికి చైనా మెయిన్ ల్యాండ్‌లో ఒక్క రిపబ్లిక్ కార్యకర్త కూడా మిగల్లేదు. అందరూ నేటి తైవాన్‌కు వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లి తమ ఆదర్శాల ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు.

వన్ చైనా పాలసీ : సమస్య ఇంతటితో అయిపోలేదు. తైవాన్‌కు వెళ్లిపోయిన రిపబ్లిక్‌లు ‘మేము సన్ యెట్ సన్ ఆదర్శాలను పాటిస్తున్నాం కాబట్టి మేమే అసలైన చైనీయులమని, ఏదో ఒకరోజు ఇప్పటి చైనాను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. దీనికి బదులుగా కమ్యూనిస్టులు పెట్టుకున్న పేరు అసలు చైనాకు ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ ఎప్పటికైనా రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఇటు చైనా, అటు తైవాన్ రెండూ కూడా ఒకటి మరోదాన్ని తమలో కలుపుకొని ‘వన్ చైనా పాలసీ’ ప్రకటించుకున్నాయి.

ఐక్యరాజ్యమితి : ఈ వివాదం ఇలా నడుస్తుండగా, ఐక్యరాజ్యసమితి ఎంటరయి, ఇప్పటి తైవాన్‌ను అసలు చైనాగా గుర్తించి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కూడా ఇచ్చేసింది. ఈ సభ్యత్వం 1971 వరకు తైవాన్‌కు చైనా పేరిట ఉండేది. అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి తైవాన్‌ను కాదని ఇప్పటి చైనాకు శాశ్వత సభ్యత్వం ఇచ్చింది. తైవాన్ ఇప్పటి చైనాలో ఓ భాగంగా గుర్తించింది. అప్పటి నుంచి తైవాన్ మీద ఒత్తిడి తేవడానికి ఇప్పటి చైనా ప్రపంచ దేశాల నుంచి వన్ చైనా పాలసీ మీద సంతకాలు చేయించి సక్సెస్ అయింది. అంటే తైవాన్‌ను ఇప్పటి చైనాలో భాగంగా అధికారికంగా ఇండియా సహా చాలా దేశాలు గుర్తించాయన్నమాట. – సేకరణ, రచయిత జాటావత్ రవీందర్ నాయక్.