ఓడిన భారత్.. సెమీ ఫైనల్‌కు చేరిన ఆసీస్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఓడిన భారత్.. సెమీ ఫైనల్‌కు చేరిన ఆసీస్‌

March 19, 2022

17

భారత మహిళా జట్టుతో ఆక్లాండ్‌ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందింది. దీంతో ఈ టోర్నీలో ఆసీస్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌-2022లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా మరోసారి అదరగొట్టింది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ స్మృతి మంధాన 10 పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ (12 పరుగులు) నిరాశపరిచింది. అయితే, యస్తికా భాటియా (59), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(68) స్కోరు బోర్డును పరిగెత్తించారు.

కానీ, ఆసీస్‌ బౌలర్‌ డార్సీ బ్రౌన్‌ వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టి జట్టును దెబ్బకొట్టింది. ఆ తర్వాత వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 57 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఇక ఆఖర్లో బ్యాట్‌ ఝులిపించిన పూజా వస్త్రాకర్‌ 34 పరుగులు సాధించింది. ఈ క్రమంలో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు స్కోరు చేసింది.

అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. ఆది నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్లు రేచల్‌ హేన్స్‌(43), అలీసా హేలీ(72) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వీరికి తోడు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ 97 పరుగులు సాధించి జట్టు విజయానికి బాటలు వేసింది. అయితే, మధ్యలో వరుణుడి ఆటంకం, గెలుపునకు 31 పరుగుల దూరంలో ఉన్న సమయంలో ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోవడం ఉత్కంఠను పెంచాయి.

ఈ క్రమంలో సెంచరీకి చేరువైన లానింగ్‌ను మేఘనా సింగ్‌ అవుట్‌ చేయడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే, ఆఖరి మూడు బంతుల వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌దే పైచేయి అయింది. ఝులన్‌ గోస్వామి బౌలింగ్‌లో బెత్‌ మూనీ వరుస ఫోర్లు కొట్టి ఆసీస్‌ విజయాన్ని ఖరారు చేసింది. ఫోర్‌ బాది జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చింది.