Defeated safaris..India's first T20 series
mictv telugu

పోరాడి ఓడిన సఫారీలు..భారత్‌కు ఇదే తొలి టీ20 సిరీస్

October 3, 2022

గతకొన్ని రోజులుగా దక్షిణాఫ్రికా-టీమిండియా జట్ల మధ్య టీ20 మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఘోరంగా ఓటమిపాలైంది. కానీ, గతరాత్రి గువాహటిలో హోరాహోరీగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో మాత్రం టీమిండియాకు చెమటలు పట్టించింది. దక్షిణాఫిక్రా ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్ (106) , డికాక్‌ (69)లు ఫోర్లు, సిక్సర్లు కొడుతూ, దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చేందుకు సర్వ ప్రయాత్నాలు చేశారు. కానీ, 16 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో మళ్లీ ఓటమిపాలయ్యారు.

ముందుగా టాస్ గెలిచిన సఫారీలు..టీమిండియాకు బ్యాటింగ్‌ను అప్పజెప్పారు. దాంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి..237 పరుగులు చేసింది. అందులో సూర్య కుమార్ (61), కేఏల్ రాహుల్ (57), కోహ్లీ (49 నాటౌట్), రోహిత్ శర్మ (43) పరుగులు చేశారు. ఇక, బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులు చేసింది. అయితే, ఓ దశలో దక్షిణాఫ్రికా 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ జోడీ ఎదురుదాడికి దిగడంతో సఫారీ స్కోరు బోర్డు పరుగులు తీసింది. చివర్లో 10 బంతుల్లో 54 పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. ఆఖర్లో 6 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి రాగా… మిల్లర్ సిక్సర్లతో విరుచుకుపడినప్పటికీ ఫలితం దక్కలేదు.

ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో చేజిక్కించుకుంది. ఇక, చివరి మ్యాచ్ ఈ నెల 4న ఇండోర్‌లో జరగనుంది. అయితే, సొంతగడ్డ మీద దక్షిణాఫ్రికాపై టీమిండియాకు ఇదే తొలి టీ20 సిరీస్ విజయం కావడం గమానార్హం.