రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా.. ఆఫీసుకెళ్లని రాజ్‌నాథ్
దేశంలో కరోనా కేసుల వివరాలను, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు వివరిస్తున్న రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కూడా ఆ వైరస్ బారిన పడ్డారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్ వచ్చిందని తేల్చారు. అజయ్ ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.
అజయ్‌కి కరోనా రావడంతో ఆయన పనిచేసే సౌత్ బ్లాక్‌లో పలు కార్యాలయాలను మూసేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోపాటు పలువురు ఉన్నతాధికారులు కార్యాలయాలకు హాజరు కావడం లేదు. అజయ్‌తో సన్నిహింతగా మెలిగిన అధికారులకు కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. 35 మంది అధికారులను హోం క్వారంటైన్ చేశారు. అజయ్ పనిచేసే అంతస్తులో రాజ్‌నాథ్‌తోపాటు ఆర్మీ చీఫ్, నేపీ చీఫ్‌ల కార్యాలయాలు కూడా ఉన్నాయి. సౌత్ బ్లాక్ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామని అధికారులు చెప్పారు. దేశంలో కరోనా కేసులు 2 లక్షలు దాటిపోవడం తెలిసిందే. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు హాట్‌స్పాట్లుగా కొనసాగుతున్నాయి.