Defense Minister Rajnath Singh visited the Krishnam Raju family
mictv telugu

కృష్ణం రాజుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజ్‌నాథ్, కిషన్ రెడ్డి

September 16, 2022

రెబెల్ స్టార్ క‌ృష్ణం రాజు ఇటీవల కన్ను మూసిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిలు ఆయన ఇంటికి చేరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి స్నేహితుడిని కోల్పోయానని, స్వగ్రామంలో అందరితో ఒక మిత్రునిలా మెలిగేవారని కొనియాడారు. అంతేకాక, గోహత్య నిషేధంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు పెట్టింది కృష్ణం రాజు గారేనని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కృష్ణం రాజు మరణవార్త వినగానే రాజ్ నాథ్ సింగ్ ప్రభాస్ నంబరు అడిగారు.

ప్రభాస్‌తో మాట్లాడిన తర్వాత ఏదో వెలితిగా ఉందని, డైరెక్టుగా కుటుంబ సభ్యులను కలవాలనుందని చెప్పారు. కృష్ణం రాజు ఇటీవలే ఫోన్ చేసి ప్రధానికి కలవాలనుందని అన్నారు. అంతకుముందు భీమవరంలో అ్లలూరి విగ్రహావిష్కరణకు వస్తానని చెప్పారు. కరోనా సమయంలో చికిత్స కోసం లండన్ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ, కరోనా వల్ల వెళ్లలేకపోయారు. కల్మషం లేని వ్యక్తి’ అని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ఫిలిం నగర్ సొసైటీలో కృష్ణం రాజు విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఆ స్థాయికి చేరిన నటుడు రాజుగారు. అందరూ చనిపోతారు కానీ చరిత్రలో మాత్రం కొంతమందే నిలిచిపోతారు. మర్యాదుక మారుపేరు ఆయన. ప్రభాస్ కూడా ఆ స్థాయికి ఎదిగాడు’ అని వ్యాఖ్యానించారు.