ఉక్రెయిన్ పై భీకర యుద్ధం చేస్తున్న రష్యా భారీగా సైన్యాన్ని కోల్పోతోంది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతుండడంతో వేలాది మంది రష్యన్ సైనికులు చనిపోతున్నారు. మరికొందరు మానసికంగా డీలాపడిపోయి బేలతనం ప్రదర్శిస్తున్నారని, కుటుంబ సభ్యులతో మాట్లాడిన మాటలను బట్టి తెలుస్తోంది. ఈ సమయంలో రష్యా రక్షణ మంత్రి సెర్గేయ్ షోయిగు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్మీని ఇప్పుడున్న 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచాలని అధ్యక్షుడిని కోరారు. వీరిలో 6 లక్షల 95 వేల మందిని వాలంటీర్లను కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ చేసుకోవాలని సూచించారు. పొరుగు దేశాలైన ఫిన్లాండ్, స్వీడన్ లు ఉక్రెయిన్ మాదిరి నాటోలో చేరాలని భావిస్తున్నాయని, అందువల్ల దేశ పశ్చిమ సరిహద్దుల్లో కొత్తగా మిలిటరీ యూనిట్లను నెలకొల్పాలని ప్రతిపాదించారు. ఇందుకోసం సైనికులు అవసరమైనందున ఆర్మీలో చేరికలను ముమ్మరం చేయాలని కోరారు. కాగా, రష్యా ఇటీవలే నిర్బంధ పద్ధతిలో సైనిక సమీకరణ చేసింది. మాజీ ఆర్మీ ఉద్యోగులే కాకుండా సాధారణ పౌరులు కూడా ఆర్మీలో చేరాలని పుతిన్ పిలుపునిచ్చాడు. దాంతో 2 లక్షల మంది కొత్తగా ఆర్మీలో చేరారు.