నిర్భయ కేసులో దోషులకు ఉరి వాయిదా - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ కేసులో దోషులకు ఉరి వాయిదా

January 16, 2020

nhjhg

దేశవ్యాప్తంగా కలకలం రేపిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నెల 22న వారిని ఉరి తీయనుండా.. ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఈ కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అభ్యర్థన దాఖలు చేశాడు. అదే సమయంలో రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు మరణశిక్షను ఆపాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో జైలు నిబంధనల ప్రకారం క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని జస్టిస్ మన్మోహన్, సంగీత ధింగ్రా సెహగల్‌కు ఢిల్లీ ప్రభుత్వం వివరించింది. ఒకవేళ రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించినా నిబంధనలు ప్రకారం దోషులను ఉరి తీయడానికి ముందు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని తీహార్ జైలు అధికారులు బుధవారం కోర్టుకు తెలిపారు. కేసుపై పూర్తి నివేదికను శుక్రవారంలోగా ఇవ్వాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ విషయమై ఢిల్లీ ప్రభుత్వం స్పందిస్తూ.. నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేష్‌ సింగ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈనెల 22న వారి ఉరిశిక్ష నిలిచిపోయిందని తెలిపింది. కాగా, ఈ కేసులో​నలుగరు దోషులను (ముఖేష్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తా) జనవరి 22న ఉరి తీయాలని ఈనెల 7న ఢిల్లీ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.