పెరిగిన మృతుల సంఖ్య..ప్రధాని దిగ్భ్రాంతి - MicTv.in - Telugu News
mictv telugu

పెరిగిన మృతుల సంఖ్య..ప్రధాని దిగ్భ్రాంతి

December 8, 2019

Delhi

దేశ రాజధాని ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులో ఉన్న అనాజ్ మండీలో ఈరోజు తెల్లవారుజామున 5.22 గంటలకు ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో క్షణక్షణానికీ మృతుల సంఖ్య పెరుగుతోంది. స్కూల్ బ్యాగులు, బాటిళ్లు సహా మరికొన్ని ఇతర చిన్న సామగ్రి తయారు చేసే కుటీర పరిశ్రమలున్న భవనంలో మంటలు చెలరేగి 35 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 43కు పెరిగినట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడ్డవారు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చాలా మంది పొగతో ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 50 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రాణనష్టాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.