ఢిల్లీ కోట ఎవరిది? సర్వేలు చెబుతున్న మాట ఇదే! - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ కోట ఎవరిది? సర్వేలు చెబుతున్న మాట ఇదే!

February 6, 2020

Delhi Election.

దేశరాజధాని హస్తినలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఢిల్లీ పీఠంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పోటా పోటీగా పావులు కదుపుతున్నాయి. ఎన్నికలు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆప్ భవిష్యత్ మనుగడ సాధించాలంటే ఈసారి విజయం సాధించక తప్పదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత వరుసగా రాష్ట్రాల్లో పవర్ కోల్పోతున్న బీజేపీ ఈ ఎన్నికలతో విపక్షాల నోరు మూయించాలని అనుకుంటోంది. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించి భవిష్యత్‌కు బాటలు వేసుకుంటూ పార్టీ కేడర్‌లో జవసత్వాలు నింపే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంతో ఈసారి ఎన్నికలు హోరాహోరీని తలపిస్తున్నాయి. పార్టీ సంగతి సరే, ఇంతకీ ఢిల్లీలో ఉన్న సగటు ఓటరు మదిలో ఏముందనేది ఆసక్తిగా మారింది. 

గత ఎన్నికల్లో బీజేపీ తమ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని చూపి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేసింది. కానీ కేజ్రీవాల్ క్రేజ్ ముందు ఆమె నిలబడలేకపోయింది. దీంతో ఈసారి మోదీని చూపుతూ బీజేపీ పావులు కదుపుతోంది. దీంతో ఇటీవల వివిధ సర్వే ఏజెన్సీలు, మీడియా సంస్థలు ఢిల్లీ వాసుల నాడిని పట్టుకునే ప్రయత్నం చేశాయి. జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

మరోసారి ఢిల్లీ పీఠం ఆమ్ ఆద్మీ పార్టీకే అని ఈ సర్వేలు వెల్లడించాయి. 70 స్థానాలు ఉన్న అసెంబ్లీకి  8న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈనెల 11న ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో ముందుగానే పల్స్ పట్టుకునే ప్రయత్నం సర్వే సంస్థలు చేశాయి. దీంట్లో కేజ్రీవాల్ పార్టీ సుమారు 42 నుంచి 56 స్థానల్లో విజయం సాధిస్తుందని వెల్లడైంది. బీజేపీ 10 నుంచి 24 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా సగటు ఓటరు మదిలో ఉన్నట్టుగా రిపోర్ట్‌లో వెల్లడైంది. 

 

కేజ్రీకే కిరీటం ఎందుకు? 

కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రధానంగా ఆయనకు ఓటు బ్యాంకుగా ఉన్న మధ్య తరగతి, పేద వర్గాల్లో ఆయన చెదరని ముద్ర వేసుకున్నాడు. అవినీతి రహిత పాలన అందిస్తారనే నమ్మకాన్ని గడిచిన పాలన కాలంలో కేజ్రీవాల్ చూపించగలిగారు. దీనికి తోడు కేేజ్రీవాల్‌కు సౌమ్యుడు అనే ముద్ర కూడా ఉండటం, అవినీతి ఆరోపణలు లేకపోవడం కలిసి వచ్చే అంశం. విద్య, ఆరోగ్యం, మహిళలకు ఉచిత రవాణా.. వంటివి ఆప్ సర్కార్ చర్యలు అందరినీ ఆకర్షించాయి. ఇంటింటికి నీటి సరఫరా,విద్యుత్ అందించడంలో అక్కడి ప్రభుత్వ సక్సెస్ అయింది. 

మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీకి సరితూగే సీఎం అభ్యర్థి ఎవరనేది అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో మోదీని చూపించి ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ వేసింది బీజేపీ. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై ఢిల్లీ ఓటర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సీఏఏ, ఎన్నార్సీ వంటి అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా మారే అవకాశం కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు. బీజేపీ ప్రధానంగా సీఏఏను చూపించి హిందువుల ఓట్లను ఒడిసిపట్టుకునే ప్లాన్ వేసింది. కానీ ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 

గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఎన్నికల సరళిని పరిశీలిస్తే సగటు ఓటరు జాతీయ ఎన్నికలు, ప్రాంతీయ ఎన్నికలకు తేడా చూపిస్తున్నారు. దీంతో ఢిల్లీ ఓటరు కూడా అలాగే తన అభిప్రాయన్ని వ్యక్తపరిచే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో జాతీయ అంశాల కంటే ప్రాంతీయ అంశాలే ప్రధానంగా పనిచేసే అవకాశం ఉంది. ఈ లెక్కన ప్రస్తుతం అక్కడ కేజ్రీవాల్‌కు సరితూగే నాయకుడు అక్కడ లేకపోవడంతో ఆయనకే ఈసారి ఢిల్లీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. మరి ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో ఓటు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది.