Delhi brokers wanted to buy Telangana's self-respect: CM KCR
mictv telugu

‘ రూ. 100 కోట్ల ఆశ చూపినా.. గడ్డిపోచలా విసిరేశారు’

October 30, 2022

మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ కొనసాగుతోంది. ఈ సభకి గులాబీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. సీఎం కేసీఆర్ వెంట పైలట్ రోహిత్ రెడ్డి..రేగా కాంతారావు..గువ్వల బాలరాజు..హర్షవర్థన్ రెడ్డి..తరలివచ్చారు. దాంతో మునుగోడు ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కి చేరింది. కేసీఆర్ మాట్లాడుతూ..మునుగోడులో అవసరం లేకుండా ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. ఉప ఎన్నిక ఫలితం కూడా ప్రజలు ఎప్పుడో తేల్చేశారని చెప్పారు. న్యాయమేంటో..ధర్మమేంటో ప్రజలకు తెలుసన్నారు. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారన్నారు. వంద కోట్ల రూపాయలు ఇస్తామని ఆశ చూపించారని దుయ్యబట్టారు. మన ఎమ్మెల్యేలు ఆ ఆఫర్‌ని ఎడమకాలితో తన్నారని అన్నారు

“కొంత‌మంది బోకర్‌గాళ్లు వంద‌ల కోట్ల రూపాయ‌ల డ‌బ్బులు ఇస్తామ‌న్నా వారి మాట‌ల‌కు లొంగ‌కుండా తెలంగాణ బిడ్డ‌లుగా వారి స‌త్తా చూపారు న‌లుగురు ఎమ్మెల్యేలు. దొంగ‌ల‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టించారు. రాజకీయమంటే అమ్ముడుపోవడం కాదని నిరూపించారు. నిఖార్స‌యిన ఎమ్మెల్యేలుగా మ‌న ముందు నిల‌బ‌డ్డ‌రు. ఇట్లాంటి వాళ్లే ఇప్పుడు రాజ‌కీయాల‌కు కావాల్సింది. మేం అంగట్లో సరుకు కాదు.. తెలంగాణ బిడ్డలమని.. తెలంగాణ ఆత్మగౌర బావుటాను హిమాలయపర్వతం అంత ఎత్తుకు ఎత్తారు. ఈ వంద‌ల కోట్ల అక్ర‌మ ధ‌నం తెచ్చి, శాస‌న స‌భ్యుల‌ను, పార్ల‌మెంట్ స‌భ్యుల‌ను సంత‌లో ప‌శువుల్లాగా కొని ప్ర‌భుత్వాల‌ను కూల‌గొట్టే ప‌ని ఇది మంచిదా” అని ప్ర‌శ్నించారు.

రెండు సార్లు ప్రధానిగా అవకాశం వచ్చిన నరేంద్ర మోదీగారు.. మీకు ఇంకేం కావాలని ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు అని సీఎం కేసీఆర్ చండూరు సభ వేదికగా ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఇప్పుడు చంచల్‌గూడ జైలులో ఉన్నరు. వాళ్లు ఆఫర్‌ చేసిన వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరగాలన్నారు. దీని వెనకాల ఉన్న వారు ఎవరైనా సరే విచారణ ఎదుర్కోవాల్సిందేనని, శిక్ష అనుభవించాల్సిందేనన్నారు సీఎం కేసీఆర్.