సీఎంపై పోలీసులకు సీఎస్ ఫిర్యాదు.. - MicTv.in - Telugu News
mictv telugu

 సీఎంపై పోలీసులకు సీఎస్ ఫిర్యాదు..

February 21, 2018

ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఎమ్మెల్యేల దాడికి గురైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ పోలీసులను ఆశ్రయించారు. సీఎం కేజ్రీవాల్ సమక్షంలో తనపై దారుణ దాడి జరిగిందని, కేజ్రీ సహా అక్కడున్న అందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఉత్తర ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. మరోపక్క.. ప్ర్రకాశ్ అబద్ధాలు చెబుతున్నారని ఆప్ నేతలు మండిపడుతున్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తలుపులు మూసి.. తలపై బాది…

అన్షు ప్రకాశ్‌ దాడిపై పోలీసులకు తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే..‘సోమవారం రాత్రి 8.45 గంటలకు సీఎం సలహాదారు ఫోన్‌ చేసి అర్ధరాత్రి సీఎం ఇంట్లో అత్యవసరం సమావేశం ఉందని, కచ్చితంగా రావాలని చెప్పారు. రేపు ఉదయం సమావేశం పెట్టుకుందాం అని చెప్పాను. కానీ వినలేదు. సీఎం ఇప్పుడు భేటీ కావాలన్నారని చెప్పాడు. ఆప్‌ సర్కారు మూడేళ్ల పాలన పూర్తయింది కనుక ప్రచార కార్యక్రమాలు, మీడియాలో ప్రకటనలపై సీఎం, ప్రజాప్రతినిధులు మంతనాలు జరుపుతారని వెల్లడించారు. నేను అక్కడి వెళ్లాను. కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, 11 మంది ఎమ్మెల్యేలు అక్కడున్నారు. నేను లోనికి వెళ్లగానే తలుపులు మూశారు. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, మరో ఎమ్మెల్యే మధ్య నన్ను కూర్చోమన్నారు. ప్రచార ప్రకటనల విడుదలపై ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని కేజ్రీవాల్ నన్ను ఆదేశించారు. అయితే ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఉండాలని నేను నచ్చజెప్పాను. వారికి ఆగ్రహం వచ్చింది. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని ఎమ్మెల్యేలు బెదిరించారు. తిట్టారు. నేను సర్కారు ప్రచారంలో సహకరించడం లేదన్నారు… టీవీ ప్రకటనలకు నేను అంగీకరించకపోతే మొత్తం రాత్రంతా అక్కడే ఉంచేస్తామని బెదిరించారు. చంపుతామని కూడా అన్నారు. నాకు అటూ ఇటూ కూర్చున్న ఎమ్మెల్యేలు నా తలపై, కణలతపై తీవ్రంగా పలుసార్లు కొట్టారు. కళ్లద్దాలు కూడా కింద పడిపోయాయి. ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డాను..’ అని సీఎస్‌ తన ఫిర్యాదులో తెలిపారు.

పక్కా కుట్ర ప్రకారం తనను పిలిచి దాడి చేయించారని, సీఎం సహా అక్కడున్న అందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే సీఎస్ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని, ఢిల్లీలో రేషన్‌ సరుకులు జనానికి ఎందుకు అందడం లేదో తెలుసుకోవడానికి ఆయనను రాత్రిపూట పిలిపించామని ఆప్ సర్కారు చెబుతోంది. ప్రచార కార్యక్రమాలు, ప్రకటనలపై ఆయనతో తామసలు మాట్లాడనే లేదని పేర్కొంటోంది. మరోపక్క.. తనను, మరో ఎమ్మెల్యేలను సీఎస్ కులం పేరుతో తిట్టాడని ఎమ్మెల్యే అజయ్‌దత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను లెఫ్టినెంట్ గవర్నర్ కు మాత్రమే జవాబుదారీనని, ఎమ్మెల్యేలకు, సీఎంకు జవాబులు చెప్పాల్సిన అవసరం తనకు లేదని సీఎస్ అన్నారని, దీంతో గొడవ జరిగిందని అజయ్‌ ఆరోపించారు.