Delhi CM Kejriwal Appeals tO PM
mictv telugu

నోట్లపై దేవుళ్లు..కేజ్రీవాల్ కొత్త అస్త్రం ఇందుకోసమేనా?

October 26, 2022

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడి చిత్రాల్ని ముద్రించాలని ప్రధాని మోదీని కోరారు.కేజ్రీవాల్ కామెంట్స్ కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఉన్నట్టుండి కేజ్రీవాల్ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు?వ్యాఖ్యల వెనక అసలు వాస్తవాలు ఏంటి?

ఇందుకోసమేనా?

త్వరలో గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. గుజరాత్ కోసం కేజ్రీవాల్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. అక్కడి ఓటర్లని ఆకట్టుకునేందుకే కరెన్సీ నోట్లపై హిందూ దేవతామూర్తుల చిత్రాల్ని ముద్రించాలనే అంశాన్ని పైకి తెచ్చారని తెలుస్తోంది.

కేజ్రీవాల్ అసలు ఏమన్నారంటే

“కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మల్ని ముద్రించాలి. ఒకవైపు గాంధీ మరోవైపు లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడి చిత్రాలు వేయాలని ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నా.మనం ఎంత కష్టపడినా దేవుడి ఆశీస్సులు వుంటేనే మంచి ఫలితాలు వస్తాయి. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఇండోనేషియానే ఆ దేశ కరెన్సీపై గణేశుడి బొమ్మ వేసింది. మనం ఆ పని చేయలేమా. డాలర్ తో పోలిస్తే రూపాయి క్షీణిస్తుంది..దేశం క్లిష్ట పరిస్థితిలో వుంది. దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే నోట్లపై దేవుడి చిత్రాల్ని ముద్రించాలి.”అని కేజ్రీవాల్ అన్నారు.

కేజ్రీవాల్‌కు బీజేపీ కౌంటర్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు, కశ్మీరీ పండిట్ల వలసల్ని అబద్ధమన్న వారు ఇప్పుడు కొత్త ముసుగు వేసుకుంటున్నారని విమర్శించింది. కేజ్రీవాల్ వి యూటర్న్ రాజకీయాలని ఆ పార్టీ నేతలు విమర్శించారు.

డ్యామేజ్ కంట్రోల్ కోసమేనా?

దీపావళికి ఢిల్లీలో బాణసంచాపై నిషేధం విధించారు. టపాసులు కాల్చినా,అమ్మినా జరిమానాతోపాటు జైలు శిక్ష తప్పదని కేజ్రీవాల్ ప్రభుత్తం హెచ్చరించింది. ఇదంతా ప్రమాదకర పొల్యూషన్ నుంచి ఢిల్లీని కాపాడేందుకేనని వివరణ ఇచ్చారు కేజ్రీవాల్. అయినా దీపావళి రోజు ఢిల్లీలో కొన్ని చోట్ల టపాసులు కాల్చారు. కేజ్రీవాల్ నిర్ణయంపై హిందూవుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పాటు రాబోయే గుజరాత్ ఎన్నికల్లో డ్యామేజ్ కంట్రోల్ కోసమే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు అంటున్నారు.