ఢిల్లీలో కంచే చేనును మేసిన సంఘటన జరిగింది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే వేధించడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన ఢిల్లీలోని ద్వారకపురిలో జరిగింది. జనక్‌పురికి చెందిన పునీత్ గ్రేవాల్(35) అనే వ్యక్తి ట్రాఫిక్ డీసీపీకి పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నంబరు ప్లేటు లేని కారులో తిరుగుతూ మహిళలను వేధిస్తున్నాడు.
మైనర్ బాలికలను సైతం వదలడం లేదు. కారులో వెళ్తూ పక్కన వెళ్తున్న ఆడవాళ్లను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నాడు. దీంతో కొందరు మహిళలు ఓ వ్యక్తి నంబరు ప్లేటు లేని కారులో తిరుగుతూ తమను వేధిస్తున్నట్టు కొన్ని రోజులుగా ద్వారకాపురి పోలీసులకు వరుసగా ఫిర్యాదులు చేశారు. బాధిత మహిళల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు. పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో అతడి ఇంట్లో శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు ఇప్పటికే వివాహమైనట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.