కరోనాతో పోలీస్ దంపతుల పోరాటం.. బిడ్డకు జన్మనిచ్చి.. - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో పోలీస్ దంపతుల పోరాటం.. బిడ్డకు జన్మనిచ్చి..

May 15, 2020

Delhi Cop

కరోనా వైరస్‌‌తో ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. మనుషుల ప్రాణాలను హరిస్తున్న ఈ మహమ్మారి కట్టడిలో కరోనా యోధులైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎంతో సాహసమైనవి. ఈ క్రమంలో బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్‌తో పాటు అతని భార్యకూ కరోనా సోకింది. చికిత్స అనంతరం తిరిగి వారు కోలుకున్నారు. ఈ సందర్భంగా వారి జీవితంలో రెండు మరుపురాని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి వారు కరోనా నుంచి కోలుకోవడం.. రెండు వారి జీవితంలోకి ఓ ముద్దులొలికే చిన్నారి రావడం. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. 

ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో దేవెందర్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే దేవెందర్‌తో పాటు మరో ఆరుగురు సిబ్బందికి కరోనా సోకింది. దేవెందర్‌ భార్యకు పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమెకూ కరోనా సోకినట్టు నిర్ధారించారు.  అయితే ఆమె అప్పటికే గర్భిణీ కావడంతో వారు ఆందోళనకు గురయ్యారు. మే 8న ఆమె ప్రసవించింది. అనంతరం వారిద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ అని తేలింది. బిడ్డకు కరోనా వ్యాపించలేదని వారు చల్లగా ఊపిరి పీల్చుకున్నారు. ఒక ఉపద్రవాన్ని ఊదుకుని బయటపడ్డామని దేవెందర్ ఆనందం వ్యక్తం చేశారు. ‘నాకన్నా నేను నా భార్య గురించి ఎక్కువ ఆందోళన చెందాను. ఎందుకంటే నేను అప్పటికే ఆసుపత్రిలో చేరాను. ఆమె కూడా ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు కరోనా వైద్యం చేయించుకుని పూర్తిగా కోలుకున్నాక పరీక్షలు చేశారు. పాజిటివ్ అని తేలడంతో ఆమె కాన్పుకు సుగమం అయింది. పండండి ఆడబిడ్డ మా జీవితాల్లోకి వచ్చింది’ దేవెందర్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు దేవెందర్‌ నివాసానికి వెళ్లి కరోనా సంక్షోభంలో విధులు నిర్వర్తించిన ఆయనకు అభినందనలు తెలిపి.. వారి బిడ్డకు తమ ఆశీర్వాదాలు అందజేశారు. వృత్తిపట్ల మీకున్న అంకితభావానికి మిమ్మల్ని ఏమీ చేయలేక కరోనా పారిపోయిందని వారు హర్షం వ్యక్తం చేశారు. పొత్తిళ్లలో తమ బిడ్డను చూసుకుని ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.