Delhi cops pose as insurance agents to crack 25-year-old murder case
mictv telugu

25 ఏళ్ల తర్వాత దొరికిన హంతకుడు… మాంచి క్రైమ్ మూవీలా పోలీసుల వేట

September 19, 2022

25 ఏళ్ల నుంచి ఓ హత్య కేసులో త‌ప్పించుకొని తిరుగుతున్న నిందితున్ని పోలీసులు చాలా చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్ తో నిందితున్ని ప‌ట్టుకున్నారు. హ‌త్య కేసుకి సంబంధించిన ఫోటోలు, ప్ర‌త్య‌క్ష సాక్షులు, ఎటువంటి ఆధారాలు లేకపోయినా.. మారు వేషాల్లో ఒక్కొక్కటిగా కూపీ లాగుతూ ఢిల్లీ పోలీసులు చేధించారు. ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ ప్రాంతంలో 1997 ఫిబ్రవరిలో జరిగిన ఓ హత్యకేసుకు సంబంధించిన నిందితుడు స్థలం మార్చి మారుపేరుతో చలామణి అవుతున్నాడు. బాధితులు కూడా ఆశలు వదిలేసుకున్న సమయంలో.. పోలీసులు ఆ హంతకుణ్ని పక్కా వ్యూహంతో పట్టుకున్నారు.

రోజువారీ కూలీ పనులు చేసుకొనే కిషన్‌లాల్‌ను అప్పట్లో ఎవరో కత్తితో పొడిచి చంపారు. ఇతనికి ఓ బిడ్డ ఉండగా.. భార్య సునీత మళ్లీ గర్భంతో ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఎవరు.. ఎందుకు చంపారో తెలియదు. ఆ సమయంలో ఎటువంటి టెక్నాలజీ లేదు కాబట్టి నిందితుడెవరో కనిపెట్టలేకపోయారు పోలీసులు. అయితే అదే ప్రాంతంలో ఉంటున్న రాము అనే మరో కూలీ హత్య జరిగినప్పటి నుంచీ కనిపించట్లేదు. దీంతో పరారీలో రామునే నిందితుడిగా పటియాలా హౌస్‌ కోర్టు ప్రకటించింది. ఆ తర్వాత ఆ కేసులో మళ్లీ ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ లేదు.

ఇక పాత కేసుల విచారణలో బాగా ట్రైనింగ్ పొందిన ఉత్తర జిల్లా దిల్లీ పోలీసు దళానికి ఈ హత్యకేసు ఫైలును అందించారు అధికారులు. అండర్‌ కవర్‌ విచారణ ప్రారంభించిన ఈ బృందం జీవితబీమా ఏజెంట్ల అవతారం ఎత్తి రాము బంధువులను ఆరా తీసింది. లఖ్‌నవూలోని జానకీపురం ప్రాంతంలో రాము ఈ-రిక్షా నడుపుతున్నట్లు తెలియడంతో పోలీసులు ఈసారి రాయితీతో ఈ-రిక్షాలు సరఫరా చేసే కంపెనీ ఏజెంట్ల అవతారం ఎత్తారు. ఈ క్రమంలో ఓ ఈ-రిక్షా డ్రైవరు… సెప్టెంబరు 14న వారిని అశోక్‌ యాదవ్‌ అనే పేరుతో చలామణి అవుతున్న రాము (50) వద్దకు తీసుకువెళ్లాడు. మొదట బుకాయించిన ఆ వ్యక్తి తర్వాత.. తానే రాము అని అంగీకరించాడు. 24 ఏళ్ల కుమారుడు సన్నీతో కలిసి వచ్చిన కిషన్‌లాల్‌ భార్య సునీత కూడా అతణ్ని గుర్తుపట్టింది. చిట్టీల కమిటీ ఇచ్చిన డబ్బుకు ఆశపడి కిషన్‌లాల్‌ను హత్య చేసినట్లు రాము అంగీకరించాడు. పోలీసుల కృషిని డీసీపీ సాగర్‌సింగ్‌ కలసీ అభినందించారు.