ఊహాగానాలు నిజమయ్యాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం 8 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని.. అందులో మనీశ్ సిసోడియా హస్తముందని సీబీఐ వెల్లడించింది. బ్యూరోక్రాట్ స్టేట్‌మెంట్ ఆధారంగా ఆయన్ను అరెస్ట్ చేసింది.సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసరాల్లో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు.
లిక్కర్ స్కాం కేసులో హస్తం ఉందన్న నేపథ్యంలో గతంలోనూ సిసోడియాను సీబీఐ విచారించింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన స్నేహితుడు విజయ్ నాయర్ అరెస్ అయ్యాడు. ఆయనతో పాటు అభిషేక బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, సమీర్ మహేంద్రు సహా ఏడుగురిని సీబీఐ చార్జ్ షీట్‌లో నిందితులగా చేర్చింది.
సీబీఐ రెండోసారి విచారణకు ముందే సిసోడియా తనను అరెస్ట్ చేస్తారని ఊహించారు. సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లే ముందు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు.ఎన్నిసార్లు జైలకు వెళ్లినా భయపడేది లేదని చెప్పారు. తనను అరెస్ట్ చేస్తే ఆప్ కార్యకర్తలు తమ కుటుంబాన్ని ఆదుకుంటారని తెలిపారు.