ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మరో వ్యక్తిని అరెస్టు చేసింది. చారియట్ మీడియాకు చెందిన రాజేశ్ జోషిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లిక్కర్ కేసులో నగదును ఒక చోట నుంచి మరోచోటకు తరలించినట్లు రాజేశ్ జోషిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఉదయం అతన్ని కస్టడీలోకి తీసుకున్న అధికారులు… సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇక ఇప్పటికే ఈ లిక్కర్ పాలసీ స్కాం లో కీలకపాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ మల్హోత్రాను… ఈడీ అధికారులు బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి గౌతమ్ మల్హోత్రాను కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అతన్ని ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు హైదరాబాద్‌కు చెందిన ఛార్టెర్డ్ అకౌంటెంట్ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు(బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్)ను సీబీఐ అరెస్ట్ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఢిల్లీ తరలించారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారిని కస్టోడియల్ రిమాండ్ కోరనున్నారు.
మరోవైపు ఈ స్కామ్ అటాచ్డ్ ఛార్జిషీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. పంజాబ్, గోవా ఎన్నికల ప్రచార నిధుల కోసమే.. ఆప్ నేతలు లిక్కర్ స్కామ్ కి తెరలేపినట్లు ఈడీ పేర్కొంది. ఈ స్కాంలో కీలక పాత్ర పోషించిన ఆప్ మీడియా వ్యవహారాల ఇంచార్జి విజయ్ నాయర్.. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడని తెలిపింది. దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఇప్పటివరకు మొత్తం 10 మంది అరెస్ట్ అయ్యారు.