ర్యాపిడో, ఓలా, ఉబెర్ కంపెనీల బైక్ సర్వీసులను ఢిల్లీ ప్రభుత్వం నిలిపివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాలని రవాణా శాఖ సోమవారం ఆదేశించింది.
ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రవాణాయేతర రిజిస్ట్రేషన్ గుర్తు / నెంబర్లు కలిగిన బైకులను ప్రయాణీకులను తీసుకెళ్లేందుకు వినియోగిస్తున్నారని, ఇది పూర్తిగా వ్యాపార కార్యకలాపాల కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ఈ సేవలు 1988 మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు తెలిపారు.
నిషేధాన్ని ఉల్లంఘిస్తే మొటి నేరానికి రూ. 5 వేలు, రెండోసారి రూ. 10 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుందని తేల్చి చెప్పింది. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్సుని కనీసం 3 ఏళ్ళ పాటు సస్పెండ్ చేస్తామని నోటీసులో పేర్కొంది. కాగా, ఇప్పటికే మహారాష్ట్రలో ఈ తరహా నిషేధం విధించిన విషయం తెలిసిందే.