ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెద్దమనసు చాటుకున్నారు. వర్షాకాలం ముగిసే వరకు నిరాశ్రయులకు ఉచిత భోజనం ఇవ్వడాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. రాజధానిలోని రాత్రి ఆశ్రయాలలో ఉంటున్న వారికి శీతాకాలం ముగిసే వరకు ఉచిత భోజనం పెట్టాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేటాయింపు వార్షిక వ్యయం రూ.15.31 కోట్లు ఉంటుందని డీయూఎస్ఐబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఇటీవల ఢిల్లీ జల్ బోర్డు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నిరంతరాయ నీటి సరఫరాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఒక కన్సెల్టెంట్ను నియమించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఢిల్లీలో నీటి సరఫరాను ప్రైవేటుపరం చేయనున్నట్టు కొందరు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని పేర్కొన్నారు. ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదన్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధిస్తామని.. ఢిల్లీలో నీటి లభ్యత పెంచేందుకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలతో చర్చలు సాగిస్తున్నామని అన్నారు. అలాగే అందుబాటులో ఉన్న నీటి సక్రమ వినియోగానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.