కొన్ని రోజుల క్రితం సుప్రీం జడ్డిపై జగన్ సర్కార్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే. సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్ర హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లాం శనివారం రాత్రి విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వెల్లడించారు. ఈ మేరకు సీఎం జగన్ సీజేఐకి లేఖ రాశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్ న్యాయవ్యవస్థపై జోక్యం చేసుకోవడం మానుకోవాలని హెచ్చరించింది.
న్యాయవ్యవస్థను కించపరిచేలా జగన్ లేఖ ఉందని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. జస్టిస్ ఎన్వీ రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారని తెలిపింది. అత్యుత్తమ నిబద్ధతగల న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎన్వీ రమణ ఒకరని పేర్కొంది. జగన్ లేఖ కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని వమ్ముచేసేలా జగన్ లేఖ ఉందని అభిప్రాయపడింది. రాజ్యాంగ వ్యవస్థలపై జగన్ దాడి చేయడం దురదృష్టకరమని పేర్కొంది.