Delhi High Court denies bail to man who married minor girl
mictv telugu

రేప్ చేసి పెళ్లి చేసుకుంటే.. వదిలేస్తారనుకున్నావా? – హైకోర్టు

July 24, 2022

మైనర్ బాలికపై అత్యాచారం చేసి, తిరిగి అదే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నంత మాత్రాన కేసు మాఫీ కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వంకతో నేరం నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది. నిందితుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. పూర్తి వివరాల్లోకెళితే.. 27 ఏళ్ల నిందితుడు 2019లో 14 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. తర్వాత రెండేళ్లకి ఆ మైనర్ బాలిక 8 నెలల పసిపాపతో నిందితుడి ఇంటి ముందు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చింది. అయితే మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో నిందితుడు బెయిల్‌కు హైకోర్టులో దరఖాస్తు చేసుకోగా, న్యాయస్థానం ఆ పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘అత్యాచార కేసుల్లో బాలిక ముందస్తుగా అంగీకరించిందా? లేదా? అన్నదానితో సంబంధం లేదు. ఒకవేళ బాలిక తెలివి తక్కువతనంతో అంగీకరించినా దానికి చట్టప్రకారం గుర్తింపు లేద’ని పేర్కొంది. అయితే నిందితుడు తాను ఆ బాలికను గుళ్లో పెళ్లి చేసుకున్నానని, దాన్ని చూసి బెయిల్ ఇవ్వాల్సిందిగా అభ్యర్ధించాడు. దీన్ని న్యాయస్థానం తిరస్కరిస్తూ ‘బాధిత బాలికను వివాహం చేసుకున్నంత మాత్రాన నిందితుడు పవిత్రుడైనట్టు కాదు. పెళ్లి చేసుకున్నకారణంగా కేసు నుంచి నిందితుడు తప్పించుకోలేడు’ అని తేల్చి చెప్పింది.