Delhi High Court does not allow termination of pregnancy at 24 weeks
mictv telugu

పెళ్లికాకుండా 24 వారాల గర్భం.. ప్రసవం అయ్యాక దత్తత ఇచ్చుకోమన్న హైకోర్టు

July 16, 2022

ఢిల్లీ హైకోర్టు శనివారం అవివాహిత గర్భం దాల్చడంపై కీలక వ్యాఖ్యలు చేసింది. అబార్షన్ చేయించుకోవడానికి చట్ట ప్రకారం కుదరదని, ప్రసవం అయ్యాక కావాలంటే దత్తత ఇచ్చుకోమని సలహా ఇచ్చింది. పూర్తి వివరాల్లోకెళితే.. ప్రియుడితో పెళ్లికాకుండానే ఇష్టపూర్వకంగా సహజీవనం చేసింది ఓ 25 ఏళ్ల యువతి. ఈ క్రమంలో అతడి వల్ల యువతి గర్భం దాల్చగా, ఈ నెల 18తో గర్భం 24 వారాలకు చేరుకుంది. అయితే ఇప్పుడు ఆవ్యక్తి యువతిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. చివరికి కోర్టు మెట్లెక్కింది. ప్రియుడితో వివాహం కోసం కాదు. గర్భం తొలగించడానికి అనుమతినివ్వమని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

పెళ్లి కాకుండా గర్భం దాల్చడం వల్ల మానసిక వేదన, సమాజంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని వేడుకొంది. అలాగే తల్లి కావడానికి కూడా మానసికంగా సిద్ధంగా లేనని గోడు వెళ్లబోసుకుంది. దీనికి స్పందించిన కోర్టు.. ‘రాజ్యాంగం ప్రకారం కోర్టు చట్టాన్ని దాటి వెళ్లలేదు. గర్భం 20 వారాలు దాటాక అబార్షన్ చేయించుకోవడానికి చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఓ సలహా ఇస్తున్నాం. ఎక్కడైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లి ప్రసవించు. తర్వాత ఆ పుట్టిన బిడ్డను దత్తత ఇవ్వవచ్చు. దత్తత తీసుకునేందుకు సమాజంలో పెద్ద క్యూ ఉంది. కావాలంటే ఈ విషయంలో కోర్టు తరపున హామీ ఇవ్వగలం’ అని వెల్లడించింది. కానీ, దీనిని యువతి తరపు లాయర్ తిరస్కరించారు. ‘24 వారాల వరకు వైద్యపరంగా వివాహితులైన మహిళలకు చట్టంలో అబార్షన్‌కు అవకాశముంది. అవివాహిత కాబట్టి వివక్ష చూపకూడదు’ అని లాయర్ వాదించడంతో.. ఈ విషయంలో స్పందించాలని కోర్టు కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఆర్డర్ జారీ చేస్తామని పేర్కొంది.