జేమ్స్ బాండ్ అంటే సినిమా కాదు. ఆ పేరుతో ఉన్న చాక్లెట్లను ఢిల్లీ హైకోర్టు గురువారం నిషేధించింది. ఇవి నకిలీవని తేలడంతో తయారీదారుకి రూ. 15.80 లక్షల పరిహారం విధించింది. వివరాల్లోకెళితే.. ప్రముఖ డైరీ ఉత్పత్తుల సంస్థ క్యాడ్బరీ ‘జేమ్స్’పేరుతో చాక్లెట్లను రూపొందించింది. మంచి రుచి, నాణ్యత ఉండడం వల్ల ఈ చాక్లెట్లు మార్కెట్లో మంచి అమ్మకాలు సాగించాయి.
బటన్ సైజులో ఉండే ఈ చాక్లెట్లు పిల్లలు, పెద్దలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే అన్నింటికీ ఉన్న సమస్యే దీనికి వచ్చింది. నకిలీల బెడద ఎక్కువయింది. దేశీయ సంస్థ అయిన ‘నీరజ్ ఫుడ్ ప్రొడక్ట్’ ఇంచుమించు ఇలాంటి చాక్లెట్లను తయారు చేసి వాటిని జేమ్స్ బాండ్ పేరుతో విక్రయించడం మొదలెట్టింది. దీంతో తమ పేరు, డిజైన్లను పోలి ఉన్న ఈ తరహా నకిలీ చాక్లెట్లపై నిషేధం విధించాలని క్యాడ్బరీ సంస్థ 2005లో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటినుంచి విచారణ సాగుతూనే ఉంది. మధ్యలో వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకుంటామని చెప్పినా, అది సాధ్యపడక మళ్లీ కోర్టు ముందుకు వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపిన కోర్టు.. ఇలాంటి చాక్లెట్లను అమ్మకూడదని నీరజ్ ఫుడ్ ప్రొడక్ట్ సంస్థను ఆదేశించింది. అంతేకాక, క్యాడ్బరీ సంస్థకు రూ. 15.80 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.