నందమూరి బాలకృష్ణ దడదడలాడిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకు సంబంధించి నిర్వాహకులు ఢిల్లీ హైకోర్టుకు ఎక్కారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు సానుకూల ఆదేశాలు జారీ చేసింది. అనధికారికంగా సాగుతున్న ఈ షో ఎపిసోడ్ల స్ట్రీమింగ్, ప్రసారాలను వెంటనే నిలపాలని ఆదేశించింది.
ఈ షో ఎపిసోడ్లను, ప్రోమోలను కొందరు వివిధ సోషల్ మీడియాలో అనధికారికంగా ప్రసారం చేస్తున్నారంటూ ‘ఆహా’ ఓటీటీ యాజమాన్య సంస్థ అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టుకెక్కింది. అనధికారిక ప్రసారాల వల్ల తమకు నష్టం జరుగుతోందని వాపోయింది. ప్రభాస్‌తో బాలయ్య చేసిన షో ఈ నెల 30న ప్రసారం కానుందని, ఆ ఎపిసోడ్‌ను, మిగతా ఎపిసోడ్లను అనధికారికంగా స్ట్రీమ్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోరింది. దీంతో కోర్టు నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ‘అన్‌స్టాపబుల్’ కంటెంటుకు సంబంధించిన అనఫీషియల్ లింకులను తొలగించాలని సంబంధిత శాఖలను ఆదేశించింది.