భార్య నగలను భర్త తీసుకోవడానికి వీలులేదని.. ఆమె అనుమతి లేకుండా తీసుకోవడం తప్పని ఢిల్లీ హైకోర్టు ఓ కేసు విషయంలో తీర్పునిచ్చింది. భార్య నగలను చోరీ చేసిన కేసులో భర్తకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. భార్య నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి అని.. భర్త అయినా సరే ముందుగా ఆమె అనుమతి లేకుండా తీసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అమిత్ మహాజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన సారథ్యంలోని డివిజన్ బెంచ్ ఉత్తర్వుల్లో మరికొన్ని అంశాలు పేర్కొంది.
ఈ కేసులో కోర్టు సదరు భర్త కోపంతో తన భార్యను అత్తగారింటి నుంచి వెళ్లగొట్టొద్దని.. అపహరించిన నగలను తీసుకెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని.. మధ్యంతర బెయిల్ కల్పించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. నిందితుడు కేసు విచారణకు అధికారులకు సహచరించడం లేదని.. చోరీకి గురైన నగలను తిరిగి ఇవ్వడం కానీ చేయలేదని తమ దృష్టికి వచ్చినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో భర్తకు ముందస్తు బెయిలు మంజూరు చేసి, పిటిషన్ను రద్దు చేయలేమని తెలిపారు. ఈ కేసులో అరెస్టు నివారణకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా కోర్టు ఈ విధంగా బదులిచ్చింది.