భార్యతో బలవంతపు శృంగారం నేరమా? మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ని నేరంగా పరిగణించాలా? అనే విషయం ఢిల్లీ హైకోర్టు భిన్న తీర్పును వెలువరించింది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ వేర్వేరు అభిప్రాయాలను వెలువరించడంతో గందరగోళం ఏర్పడింది భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ఒక జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు.
భార్య అనుమతి లేకుండా శృంగారంలో పాల్గొంటే.. అది లైంగిక దాడి కిందకే వస్తుందని స్పష్టం చేశారు.
అయితే, బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విబేధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం లేదని.. కావున, భార్యపై బలవంతపు శృంగారం నేరం కిందకు రాదని పేర్కొన్నారు.. అంతేకాదు, జస్టిస్ రాజీవ్ ఇచ్చిన ఆదేశాలను అంగీకరించడం లేదని పేర్కొన్నారు. దీంతో ఒకే కేసులో రెండు భిన్నాభిప్రాయాల తీర్పు వెలువడినట్టు అయ్యింది. ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేసిన వారిని.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించారు.
2015లో ఈ వ్యవహారంపై మొదటి పిటిషన్ దాఖలు కాగా, ఆ తర్వాత మరికొన్ని దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లకు కౌంటర్‌గా.. పురుష హక్కుల సంఘాలు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఢిల్లీ హైకోర్టులో రోజూవారీ వాదనలు జరగ్గా ఫిబ్రవరి 21వ తేదీన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది కోర్టు.