గృహ హింస కేసుల్లో భార్యల స్వార్ధం.. హైకోర్టు సీరియస్ - MicTv.in - Telugu News
mictv telugu

గృహ హింస కేసుల్లో భార్యల స్వార్ధం.. హైకోర్టు సీరియస్

July 13, 2022

వేధింపులకు గురవుతున్న మహిళల కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస చట్టాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. భర్తలను హింసించేందుకు, వారి కుటుంబ సభ్యుల పరువు తీసేందుకు ఈ చట్టాన్ని వాడుకుంటున్నారని సీరియస్ అయింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలించాలని, ఇలా వదిలేస్తే సమాజంలో మహిళలు పెడధోరణి పట్టే అవకాశాలు మెరుగుపడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. తన ముందుకు విచారణకు వచ్చిన ఓ కేసు సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకెళితే.. ఓ భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి తన భర్త, వారి కుటుంబం నుంచి డబ్బు లాగాలని కుట్ర చేసింది. అందులో భాగంగా వ్యూహాత్మకంగా కనిపించకుండా పోయింది. దీన్ని అడ్డం పెట్టుకుని ఆమె తరపు పుట్టింటి వాళ్లు భర్త కుటుంబాన్ని వేధించసాగారు. అత్తింటి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపించి డబ్బు లాగేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని భర్త తరపు వాళ్లు కోర్టును ఆశ్రయించారు. విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య, ఆమె కుటుంబ సభ్యులు ఆత్మహత్య నాటకమాడినట్టు తేలింది. దీంతో ఆగ్రహించిన కోర్టు.. భార్య, ఆమె తరపు బంధువులపై కేసు నమోదుకు ఆదేశించింది. అంతేకాక, పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేస్తూ.. ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల సమాజంలో భర్తల గౌరవం పోతోందని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.