Delhi Jal Board official bathes in Yamuna water amid BJP's toxic chemicals allegations
mictv telugu

బీజేపీ ఎంపీకి కౌంటర్.. యమునా నీళ్లతో స్నానం చేసిన అధికారి

October 30, 2022

పదిమందిలో తనను అవమానించి, తిట్టిన బీజేపీ ఎంపీ పర్వేష్‌ వర్మకు ఢిల్లీ జల సంఘం అధికారి కౌంటర్‌ ఇచ్చారు. ఛత్ పూజ నేపథ్యంలో యమునా ఘాట్‌ను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారని ఢిల్లీ జల్‌ బోర్డ్‌ అధికారులపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ వాదనకు దిగారు. ఎనిమిదేళ్ల వరకు యమునా నది శుభ్రం గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు హడావుడిగా రసాయనాలు చల్లుతున్నారని విమర్శించారు. ‘ఈ నీటిలో మొదట మీరు మునగండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కెమికల్స్‌ను మీ తలపై పోయమంటారా? మీకు సిగ్గు లేదా? అంటూ వారిని నిన్న దుర్భాషలాడారు.

కాగా, బీజేపీ ఎంపీ పర్వేష్‌ వర్మ విసిరిన చాలెంజ్‌ను ఢిల్లీ జల సంఘం (డీజేబీ) నాణ్యత నియంత్రణ అధికారి సంజయ్ శర్మ స్వీకరించారు. ఆదివారం నాడు రసాయనాలతో శుభ్రం చేసిన యమునా నది నీటితో ఆయన స్నానం చేశారు. ఆ నీటిలో స్నానం చేయవచ్చని భక్తులకు భరోసా ఇచ్చారు. డీజేబీ వైస్ చైర్మన్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఈ వీడియోను ట్వీట్‌ చేశారు. ఛత్‌ పండుగకు ముందు ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న పనిని అడ్డుకునేందుకు బీజేపీ ఎంపీ పర్వేష్‌ వర్మ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.