ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేంద్రం ప్రారంభం.. 10 వేల బెడ్స్ సామర్థ్యంతో.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేంద్రం ప్రారంభం.. 10 వేల బెడ్స్ సామర్థ్యంతో..

July 5, 2020

Chhatarpur

దేశంలో నానాటికీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఢిల్లీలో కరోనా కేసులు ప్రవాహంలో పెరుగుతున్నందున భారీ కేంద్రాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భావించారు. అనుకున్న సమయంలోనే నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ కరోనా కేంద్రంలో 10 వేల బెడ్స్‌ సామర్థ్యం ఉంది. దీనిని ఢిల్లీ లెఫ్ట్‌‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు అనిల్‌ బైజాల్‌ ట్విటర్‌ వేదికగా ఆసుపత్రి వివరాలను వెల్లడించారు. మరోవైపు ఈ కోవిడ్‌ కేంద్రాన్ని ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు పరిశీలించారు. దీనికి ‘సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌’ అని నామకరణం చేశారు. దక్షిణ ఢిల్లీ సమీపంలోని చత్తర్‌పూర్‌ ఆధ్యాత్మిక క్షేత్రం రాధాస్వామి సత్సంగ్‌ బియాస్‌ కాంప్లెక్స్‌ను తాత్కాలిక కరోనా ఆసుపత్రిగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

కాగా, 1700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పు ఉన్న ఈ కేంద్రం దాదాపు 20 ఫుట్‌బాల్‌ మైదానాలకు సమానమైన స్థలంలో నిర్మించారు. ఇది చైనాలో నిర్మించిన కోవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రికి పదింతలు పెద్దది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని నిర్మించారు. ఈ కేంద్రంలో మొత్తం నాలుగు విభాగాలు ఉన్నాయి. ఒక్కొక్క విభాగంలో 250 పడకలు ఉంటాయి. ఒక విభాగంలో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్(ఐటీబీపీ)‌ విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో పనిచేస్తారు.