ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన పలువురు నిందితులకు కోర్టులు బెయిళ్లు ఇచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఐదుగురు జైలు నుంచి బయటికి రాగా, తాజాగా మరొకరికి కూడా ఊరట లభించింది. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఢిల్లీలోని సీబీఐ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్ట్ అప్పగించి, రెండు లక్షల పూచీకత్తు ఇవ్వాలని పేర్కొంది. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ విధానం రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థల అనుమానిస్తున్నాయి.
మద్యం కంపెనీ సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు వంద కోట్ల లంచం ముట్టడంతో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నాయి. దీనికి సంబంధించి తమకు కొన్ని ఆధారాలు దొరికాయంటున్నాయి. ఈ కేసులో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనోశ్ సిసోడియా ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రఘురామి రెడ్డితోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.