ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ వేదికగా స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత కూడా అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆమె స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. దర్యాప్తు సంస్థలు ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలా బీజేపీ నేతలు చెబుతారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు చెప్పినట్టు అరెస్ట్ లు చేస్తే ఎలా అని మండిపడ్డారు. ఇలాంటి మాటలు ఆడితే మర్యాదగా ఉండదని బీజేపీ నేతలను హెచ్చరించారు. ఇలాంటి తరహా వ్యాఖ్యలతో బీజేపీ నేతల డైరెక్షన్‌లో అధికారులు పనిచేస్తున్నారని తెలుస్తుందన్నారు. వీళ్లు చెప్పి వాళ్లు చెప్పి చేస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందన్నారు కవిత. అదానీపై ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగడం లేదని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఏం జరుగుతుందో చూద్దామని స్పష్టం చేశారు.
అదే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill)ను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు కవిత తెలిపారు. దేశ వ్యాప్తంగా పని చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి భారత జగృతిగా మార్చినట్లు వెల్లడించారు. భారత జాగృతి మొదటి కార్యక్రమం ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష అని చెప్పారు.ఈ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీ వచ్చిన తర్వాత కనీసం జనగణన చేయలదేని విమర్శించారు. బీసీ గణన కూడా చేపట్టాలన్నారు.