ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను సవాల్ చేస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరికొన్ని గంటల్లో విచారించనుంది. జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా ఎమ్ త్రివేదీల ధర్మాసనం ఈ కేసును విచారణ చేయనుంది. ఈ కుంభకోణంలో ఈడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని కవిత ఈ నెల 23న దాఖలు చేసిన పిటిషన్‌లో సవాలు చేశారు.
అంతేకాకుండా.. ఈడీ తనపై తదుపరి బలవంతపు చర్యలు తీసుకోకుండా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తనకు పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం జారీచేసిన నోటీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 160కి విరుద్ధంగా ఉన్నాయని, వాంగ్మూలం నమోదు చేసేప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కవిత ఆ పిటిషన్‌లో కోరారు.
నిజానికి మార్చి 24వ తేదీనే ఈ పిటిషన్ పై అసలు విచారణ జరగవలసి ఉండగా, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజుకు విచారణ వాయిదా వేసింది. కవిత పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో ఐటెం నెంబర్ 36 గా లిస్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం కవిత పిటిషన్ పై నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత సౌత్ గ్రూప్‌లో ఉందని ఈడీ పేర్కొంటూ, ఇప్పటికే మూడు రోజులపాటు విచారించింది ఈడీ.
ఈరోజు ఇరు వర్గాల వాదనలు ఏ విధంగా సాగుతాయి? ఈడీ కవిత పిటిషన్ పై ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు ముందు ఏం జరగబోతుంది? అన్నది దేశ రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.