Delhi liquor scam linked with Telangana: BJP MP Verma
mictv telugu

ఢిల్లీ లిక్కర్ స్కాంకు తెలంగాణతో లింకు : బీజేపీ ఎంపీ ఆరోపణ

August 19, 2022

ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు చేయడం సంచలనంగా మారింది. వివాదాస్పదమైన కొత్త ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల మీద గవర్నర్ ఆదేశాలతో సీబీఐ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్కాంతో తెలంగాణకు సంబంధం ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కొత్త పాలసీ రూపకల్పన అంతా తెలంగాణలోనే జరిగాయని పేర్కొన్నారు. ఈ డీల్ సెట్ చేయడానికి తెలంగాణకు చెందిన వాళ్లు బుక్ చేసిన హోటళ్లు, రెస్టారెంట్లకు మనీష్ సిసోడియా వెళ్లారని తెలిపారు. ఇందులో 10 నుంచి 15 మంది ప్రైవేట్ వ్యక్తులతో పాటు సిసోడియా కూడా ఉన్నారని భావిస్తున్నట్టు వివరించారు. కాగా, మనీష్ సిసోడియా సహా ముగ్గురు ప్రజా ప్రతినిధులపై పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. ఇదిలా ఉంటే ఈ నెల మొదట్లో ఒంగోలు ఎంపీ పేరు ఈ స్కాంలో ప్రముఖంగా వినిపించింది. దీనిపై ఆయన అప్పుడే వివరణ ఇచ్చారు. నిబంధనల ప్రకారం పారదర్శకంగానే తమ కంపెనీ టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నట్టు స్పష్టం చేశారు.