దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే కేసుతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. తాజాగా కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుంది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ (CBI) సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఈ సమన్లలో సీబీఐ పేర్కొంది. కొత్తగా లభించిన ఆధారాలపై ప్రశ్నించేందుకు సిసోడియాకు సమన్లు జారీ చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. గతేడాది అక్టోబర్లో కూడా మనీష్ సిసోడియాను 9 గంటల పాటు సీబీఐ విచారించింది. ఆయన నివాసంలో, కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. తాజాగా మరోసారి ఆయనకు నోటీసులు ఇవ్వడం ఆప్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది.
సీబీఐ నోటీసులు ఇవ్వడంపై సిసోడియా ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.”మద్యం కుంభకోణం కేసులో రేపు విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. నాకు వ్యతిరేకంగా వారు సీబీఐ, ఈడీల పూర్తి స్థాయి అధికారాలను ఉపయోగిస్తున్నారు. గతంలో సీబీఐ అధికారులు నా నివాసంలో సోదాలు చేశారు. బ్యాంక్ లాకర్స్ ను తనిఖీ చేశారు. ఏం దొరకలేదు. ఢిల్లీలోని పిల్లలకు ఉత్తమ విద్యను అందించేందుకు నేను ప్రయత్నిస్తున్నా. నన్ను అడ్డుకోవాలని చూస్తున్నారు. విచారణకు నేను పూర్తిగా సహకరిస్తా” అని ట్వీట్ చేశారు.