Delhi Liquor Scam:CBI Notice To MLC Kavitha
mictv telugu

అటు ఈడీ..ఇటు సీబీఐ…కవిత ఏం చేయబోతున్నారు?

December 3, 2022

Delhi Liquor Scam:CBI Notice To MLC Kavitha

సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత ఏం చేయబోతున్నారు. రాజకీయంగా, న్యాయపరంగా ఎలా ఎదుర్కొబోతున్నారు. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్‌తో కవిత ఏం చర్చించారు? అటు ఈడీ ఇటు సీబీఐల్ని ఎలా డీల్ చేస్తారు..?తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. రాజకీయ వర్గాలు ఈ పరిణమాల్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

సీబీ..ఐ

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ శుక్రవారం నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలో నమోదు చేసిన ఆర్సీ 53 ఏ/2022 కేసులో దర్యాప్తుకోసం సీఆర్ పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు పంపింది. 6న ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పేర్కొంది.
ఢిల్లీ లేదా హైదరాబాద్‌లోగానీ విచారణ ఉంటుందని సీబీఐ తెలిపింది. సీబీఐ నోటీసుల్ని కవిత ధ్రువీకరించారు.
6న హైదరాబాద్‌లోని తన నివాసంలో కలువచ్చని అధికారులకు తెలిపారు. ఇంటి దగ్గర వారికి వివరణ ఇస్తానని కవిత చెప్పారు.

సీఎం కేసీఆర్‌తో భేటి

ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి కేసీఆర్‌ని శనివారం ప్రగతిభవన్‌లో కలిశారు. సీబీఐ నోటీసులపై చర్చించారు. వీరిద్దరి భేటి రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే న్యాయనిపుణులతో కవిత చర్చించినట్లు తెలుస్తోంది. రాజకీయంగా, న్యాయపరంగా ఏం చేయాలి.ఎలా ముందుకెళ్లాలి అనే అంశాలపై కేసీఆర్‌తో చర్చించినట్లు సమాచారం.మరోవైపు కవితకు సంఘీభావంగా పెద్దయెత్తన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె ఇంటికి వస్తున్నారు.కవిత ఇంటి దగ్గర పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

అంతకు ముందు ఈడీ

సీబీఐ నోటీసులకు రెండురోజుల ముందు ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ చేర్చించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరుని ప్రస్తావించింది. 32 పేజీల రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరు మూడుసార్లు ప్రస్తావనకు వచ్చింది. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం రూ.100 కోట్లు ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించింది. ఈ సౌత్ గ్రూప్ ని కవిత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి , వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంట్రోల్ చేశారు. సౌత్ గ్రూప్ ద్వారా రూ.100కోట్లను విజయ్ నాయర్‌కు చేర్చారు. విచారణలో భాగంగా ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా చెప్పారు. ఈ ఎపిసోడ్‌లో కవిత ఉపయోగించిన 10 సెల్ ఫోర్లును ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది. ఈ కేసులో 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది. 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లు మార్చారని , ఆ 10 ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. 2021 సెప్టెంబర్ 1న ఒకేరోజు ఎమ్మెల్సీ కవిత, బోయినపల్లి అభిషేక్ రావు, సీఏ బుచ్చిబాబు ఫోన్లు మార్చారని అందులో ఉంది.

ఇదీ లిక్కర్ కేసు

ఢిల్లీలోని 32 జోన్లలో జోన్ల వారీగా లిక్కర్ లైసెన్సులు పొందిన వాళ్లలో సమీర్ మహేందు, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అమిత్ అరోరాకు చెందిన కంపెనీలు ఉన్నాయి. మరికొన్ని కంపెనీల వెనుక ఎవరున్నరన్నది విచారణ జరుగుతోంది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తయారీలో కీలకంగా ఉన్న మంత్రుల బృందంలో మనీశ్ సిసోడియా, సత్యేంద్రజైన్ , కైలాష్ గెహ్లాట్ ఉన్నారు. నిపుణుల కమిటీ రిపోర్ట్ ,పబ్లిక్ సూచనలకు విరుద్ధంగా ఢిల్లీ మంత్రుల బృందం లిక్కర్ పాలసీని తయారు చేసింది. పాలసీ పైనల్ అయిన 3 నెలల తర్వాత ఆలస్యంగా పబ్లిక్ డొమైన్‌లో పెట్టారు. హోల్‌సేల్ వ్యాపారాన్ని తయారీ నుంచి వేరు చేసి, పూర్తిగా ప్రైవేటుకే ఇచ్చేలా లిక్కర్ పాలసీని మార్చారు. లిక్కర్ విక్రయాల ద్వారా హోల్ సేల్ మద్యం సంస్థలకు వచ్చే లాభం పాలసీలో 5 శాతమే ఉంది. దీన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఏకంగా 12శాతానికి పెంచింది. ఇంత భారీగా పెంచడానికి అర్థంలేని కారణాలను చూపించారు. మరోవైపు నిపుణుల కమిటీ రిపోర్ట్‌ని అమలు చేయలేదు. కొన్ని నిర్ధారించిన ప్రాంతాల్లో షాపులు తీయలేమన్న పేరుతో లైసెన్స్ పొందిన వారి ఫీజుల్ని భారీగా తగ్గించారు. కానీ గత మూడేళ్ల ఈ పాలసీ కాలంలో సేల్స్ భారీగా పెరిగాయి. కొన్ని షాపులు తీయకపోవడం వల్ల వారికి ఎలాంటి నష్టం రాలేదు. కానీ లైసెన్స్ ఫీజు తగ్గించడం వల్ల వ్యాపారులకు రూ.719 కోట్లు అనసరలాభం కలిగించారు. ఈ మేరకు ఢిల్లీ ఖజానాకు నష్టం జరిగింది. లైసెన్స్ ఫీజులను తగ్గించడం, పలు ఇతర మినహాయింపులతో రూ.2,873 కోట్ల నష్టం వాటిల్లింది.

Delhi Liquor Scam:CBI Notice To MLC Kavitha